China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం: వీడియో ఇదిగో!

  • హునాన్ ప్రావిన్స్ రాజధాని చంగ్సాలో ఘటన
  • మంటలను అదుపు చేసిన 280 మంది అగ్నిమాపక సిబ్బంది
  • సెల్‌ఫోన్ సర్వీసులకు అంతరాయం కలగలేదన్న టెలికం సంస్థ
  • ఇబ్బందులు పడ్డామంటున్న యూజర్లు
Huge Fire In China Skyscraper Dozens Of Floors Burned

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ ఆకాశహర్మ్యం ఒకటి అగ్నికీలల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. హునాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చంగ్సాలోని 42 అంతస్తుల టెలికం భవనంలో నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగి క్రమంగా భీకరంగా మారాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భవనంలోని డజన్ల కొద్దీ అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 218 మీటర్ల ఎత్తైన ఈ భవనంలో ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు 280 మంది ఫైర్ ఫైటర్లు శ్రమించారు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎవరూ మరణించలేదని టెలికం సంస్థ తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా సెల్‌ఫోన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపింది. అయితే, మొబైల్ యూజర్లు మాత్రం సర్వీసులు పనిచేయలేదని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భవనం నుంచి దట్టంగా ఎగసిపడుతున్న పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం, భవనం నుంచి శిథిలాలు కిందపడుతుండడం కొన్ని వీడియోల్లో ఉంటే.. భవనంలో చిక్కుకుపోయిన వర్కర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరికొన్ని వీడియోల్లో ఉంది.

More Telugu News