YSRCP: వైఎస్సార్ తోడ‌ల్లుడిని అయినందుకే నాపై తప్పుడు కేసు పెట్టారు: వైవీ సుబ్బారెడ్డి

  • ఇందూ ప్రాజెక్ట్స్ కేసులో వైవీ సుబ్బారెడ్డి పేరు
  • త‌న పేరును తొల‌గించాలంటూ సుబ్బారెడ్డి క్వాష్ పిటిష‌న్‌
  • విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హైకోర్టు
  • సుబ్బారెడ్డి పేరును తొల‌గించ‌వ‌ద్ద‌న్న సీబీఐ
  • విచార‌ణ‌ను ముగించి తీర్పు రిజ‌ర్వ్ చేసిన కోర్టు
ts high court concludes yv subbareddy quash petition and reserves verdict

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసుల‌కు సంబంధించి శుక్ర‌వారం తెలంగాణ హైకోర్టులో ఓ కీల‌క విచార‌ణ జ‌రిగింది. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్‌పైనా కేసు న‌మోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న పిన‌త‌ల్లి భ‌ర్త, ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న‌ వైవీ సుబ్బారెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు చేర్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో త‌న పేరును తొల‌గించాలంటూ ఇటీవ‌లే వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టు ముందు ఓ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి తోడ‌ల్లుడు అయినందున‌నే త‌న క్లెయింట్‌ను ఈ కేసులో ఇరికించార‌ని ఆయ‌న కోర్టుకు తెలిపారు. త‌మ వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సుబ్బారెడ్డి పేరును ఈ కేసు నుంచి తొలగించాల‌ని కోరారు. 

అయితే, ఈ వాద‌న‌ను తిప్పికొడుతూ సీబీఐ వాద‌న‌లు వినిపించింది. కేవ‌లం కొన్ని ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టి... దానితో సుబ్బారెడ్డి కోట్లు గ‌డించార‌ని సీబీఐ ఆరోపిచింది. ఈ కార‌ణంగా ఆయ‌న పేరును కేసులో నుంచి తొల‌గించ‌వ‌ద్ద‌ని కోరింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న కోర్టు... విచార‌ణ ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్లు వెల్లడించింది.

More Telugu News