Narendra Modi: ఇది యుద్ధాల యుగం కాదు... పుతిన్ తో ప్రధాని మోదీ

  • ఉజ్బెకిస్థాన్ లో ఎస్ సీవో సదస్సు
  • మోదీ, ముఖాముఖీ పుతిన్ భేటీ
  • అంతర్జాతీయ అంశాలపైనా చర్చ
  • భారత్ ఆందోళనలను అర్థం చేసుకున్నామన్న పుతిన్ 
Modi says Putin this not war era

ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ సంస్థ (ఎస్ సీవో) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. సదస్సు నేపథ్యంలో, ఇరువురు నేతలు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.... పుతిన్ కు మెత్తగా చురకలంటించారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను దృష్టిలో ఉంచుకుని... "ఇది యుద్ధాల శకం కాదు... ఇప్పుడసలు యుద్ధానికి సమయమే కాదు... అంతవరకు కచ్చితంగా చెప్పగలను" అని పుతిన్ కు హితవు పలికారు. 

అందుకు పుతిన్ స్పందిస్తూ... ఉక్రెయిన్ అంశంలో భారత్ ఆందోళనలను మేం అర్థం చేసుకోగలం అని బదులిచ్చారు. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఫిబ్రవరి 24న రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడులు మొదలుపెట్టాక మోదీ, పుతిన్ ముఖాముఖీ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఈ సమావేశంలో ఇరువురు ద్వైపాక్షిక అంశాలపైనా, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరిపారు. 

కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడిని భారత్ ఎప్పుడూ నేరుగా విమర్శించకపోయినా, చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని మొదటి నుంచి చెబుతోంది. కాగా, వచ్చే ఏడాది షాంఘై కోఆపరేషన్ సదస్సుకు భారత్ ఆతిధ్యమివ్వనుండగా, ఈ విషయంలో భారత్ కు చైనా మద్దతు పలికింది.

More Telugu News