Andhra Pradesh: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కడప స్టీల్ ప్లాంట్ పై కొనసాగుతున్న చర్చ

  • మూడేళ్లు గడిచి పోయినా కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించలేదని అచ్చెన్న విమర్శ
  • ఒక్క ఇటుక కూడా వేయలేదని ఎద్దేవా
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంటును పూర్తి చేయాలని డిమాండ్
AP Assembly second day session begins

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ప్రశ్నపై చర్చ జరుగుతోంది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కడప స్టీల్ ప్లాంట్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్లాంట్ పనులను చేపట్టామని... ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిందని చెప్పారు. 

జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ శంకుస్థాపన చేశారని... ప్లాంటును నిర్మించిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని ఆ సందర్భంగా ఆయన చెప్పారని... మూడేళ్లు గడిచిపోయినా ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టకపోవడమే కాకుండా... వైజాగ్ స్టీల్ ప్లాంటును కూడా ప్రైవేటుకు అప్పగించారని అన్నారు. 

ఈ సందర్భంగా స్పీకర్ కల్పించుకుని... టాపిక్ ను పక్కదోవ పట్టించొద్దని... కడప స్టీల్ ప్లాంటుపైనే మాట్లాడాలని, వేరే విషయం గురించి మాట్లాడొద్దని చెప్పారు. అనంతరం అచ్చెన్నాయుడు కొనసాగిస్తూ... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చయినా సరే కడప ప్లాంటును పూర్తి చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ పై చర్చ కొనసాగుతోంది.

More Telugu News