Yeluri Sambasiva Rao: ఉత్తరాంధ్రపై జగన్‌కు నిజంగా అంత ప్రేమే ఉంటే ఈ మూడేళ్లు ఏం చేశారు?: టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి

  • వైసీపీ ప్రభుత్వం అమరావతిని చంపేసిందన్న టీడీపీ ఎమ్మెల్యేలు
  • గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే ప్రస్తుత ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న ఎమ్మెల్యే
  • కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తాము నిర్మిస్తే జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా
  • విజయసాయి ప్రైవేటు బిల్లుతో అసెంబ్లీకి ఆ అధికారం లేదన్న విషయం అర్థమైందన్న ఏలూరి
TDP MLA Yeluri Sambasiva Rao Slams Jagan Over Amaravati

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  ఉత్తరాంధ్రపై నిజంగా అంత ప్రేమే ఉంటే ఈ మూడేళ్లు విశాఖను అభివృద్ధి చేయకుండా ఏం చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. నిన్న సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో నేడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ ప్రభుత్వం అమరావతిని చంపేసిందన్న ఆయన అక్కడ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే ప్రస్తుతం పాలన సాగుతోందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రూ.3 వేల కోట్ల అప్పు కోసం ప్రభుత్వం అమరావతి భూముల్ని ఎకరా రూ. 17 కోట్లకు తాకట్టు పెట్టిందన్న ఆయన, ఈ విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తమ ప్రభుత్వం నిర్మిస్తే దానిని తామే నిర్మించినట్టు సీఎం అసెంబ్లీలో చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్న జగన్ ఈ మూడేళ్లలో విశాఖను ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. అంతేకాకుండా, తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలను ఎందుకు వెళ్లగొట్టారని సాంబశివరావు ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. 

అమరావతి రైతులు తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తుంటే జగన్ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునేలా అసెంబ్లీకి అధికారం ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టారంటే అధికారం లేదన్న విషయం అర్థమవుతోందని సాంబశివరావు అన్నారు.

More Telugu News