Pakistan: మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారు.. 75 ఏళ్లుగా ఇదే తంతు: పాకిస్థాన్ ప్రధాని ఆవేదన

  • మిత్ర దేశాల్లో పర్యటించినా డబ్బు కోసమే వచ్చామని అనుకుంటున్నారన్న పాక్ ప్రధాని
  • తమకంటే చిన్న దేశాలు ఆర్థికంగా తమను దాటిపోయాయని వ్యాఖ్య
  • ఇటీవల సంభవించిన వరదలు ఆర్థిక పరిస్థితిపై దారుణ ప్రభావం చూపించాయని ఆవేదన
Even Friendly Nations Feel We Have Come To Beg For Money says Pakistan PM

తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కంటే చిన్న దేశాలు ఆర్థికంగా తమను దాటిపోతే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్పపట్టుకుని అడుక్కుంటున్నామని అన్నారు. మిత్ర దేశాల్లో పర్యటిస్తే కూడా డబ్బుల కోసమే వచ్చారని అనుకుంటున్నారని, వారికి ఫోన్ చేసినా అలానే భావిస్తున్నారని అన్నారు. న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని, దేశం ఇప్పుడు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. తాను ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికే దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న ప్రధాని.. ఇటీవల సంభవించిన వరదలతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. వరదల్లో దేశవ్యాప్తంగా 1400 మంది చనిపోయారని, దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు దీని ప్రభావానికి గురయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా రూ.95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. 

రూ.32 వేల కోట్ల అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వర్షాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని షాబాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ రూ. 14 వేల కోట్లు, చైనా వంటి మిత్రదేశాలు రూ. 32 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చాయని పాక్ ప్రధాని పేర్కొన్నారు.

More Telugu News