Roger Federer: ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్

  • ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికిన ఫెదరర్
  • వచ్చేవారం జరిగే లేవర్ కప్ తో కెరీర్ ముగిస్తానని వెల్లడి
  • ఇప్పటిదాకా 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఫెదరర్
  • కెరీర్ పై ప్రభావం చూపిన గాయాలు, శస్త్రచికిత్సలు
Roger Federer announces retirement from Tennis

టెన్నిస్ ప్రపంచంలో మహోన్నత క్రీడాకారుడు అనదగ్గ స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నిస్ పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. వచ్చేవారం లండన్ లో జరిగే లేవర్ కప్ తన చిట్టచివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. 

స్విట్జర్లాండ్ కు చెందిన 41 ఏళ్ల ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. అయితే కరోనా సంక్షోభం వచ్చాక ఫెదరర్ పెద్దగా పోటీల్లో పాల్గొనలేదు. గతేడాది వింబుల్డన్ టోర్నీ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మూడేళ్లు గాయాలు, శస్త్రచికిత్సలతోనే సరిపోయిందని ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో విచారం వ్యక్తం చేశాడు. 

టెన్నిస్ పోటీల్లోకి తిరిగొచ్చేందుకు తీవ్రంగా శ్రమించానని, కానీ తన శారీరక సామర్థ్యం, పరిమితులు తనకు స్పష్టమైన సందేశాన్ని అందించాయని, అందుకే ఆటకు ముగింపు పలుకుతున్నానని ఓ సందేశంలో వెల్లడించాడు. 

గత 24 ఏళ్ల కాలంలో 1,500కి పైగా మ్యాచ్ లు ఆడానని ఫెదరర్ తెలిపాడు. తాను ఊహించిన దానికంటే అధికంగా టెన్నిస్ ప్రపంచం తనను అక్కున చేర్చుకుందని వివరించాడు. తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం ఇదేనని గుర్తించానని, వచ్చేవారం జరిగే లేవర్ కప్ తన కెరీర్ లో చివరి ఏటీపీ టోర్నమెంట్ అవుతుందని పేర్కొన్నాడు. 

భవిష్యత్తులోనూ టెన్నిస్ ఆడతానని, అయితే గ్రాండ్ స్లామ్ పోటీల్లోనూ, ఏటీపీ టూర్ మ్యాచ్ ల్లోనూ ఆడబోనని వివరించాడు. తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ఇంతటితో ముగిసిందని వెల్లడించాడు. 

2003లో తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ నెగ్గాక, చాలాకాలం పాటు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫెదరర్ ఆధిపత్యం కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో గాయాలు ఫెదరర్ ఆటతీరుపై ప్రభావం చూపించాయి. ఫెదరర్ సమకాలికులు అనదగ్గ రాఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ ఇప్పటికీ అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆడుతుండగా, శస్త్రచికిత్సల అనంతరం ఫెదరర్ పుంజుకోలేకపోయాడు. గత రెండేళ్ల వ్యవధిలోనే ఫెదరర్ మూడు మోకాలి ఆపరేషన్లు చేయించుకున్నాడు.

కాగా, ఫెదరర్ తన ఆదాయంలో కొంతభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాడు. ఫెదరర్ విరాళాలతో ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

More Telugu News