AP Assembly Session: రాజ‌ధాని ప్ర‌క‌ట‌న జ‌రిగిన త‌ర్వాత అక్కడ భూములు కొంటే త‌ప్పేముంది?: ప‌య్యావుల‌ కేశవ్

  • అమ‌రావ‌తిలో ప‌య్యావుల కుమారుడు భూములు కొన్నార‌న్న బుగ్గ‌న‌
  • అమ‌రావ‌తిలో భూములు కొన్న మాట వాస్త‌వమేన‌న్న ప‌య్యావుల‌
  • రాజ‌ధానిపై నాటి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కొన్నామ‌ని వెల్ల‌డి 
payyavula keshav gives clarity on buggana allegations

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన తొలి రోజు గురువార‌మే స‌భ‌లో అధికార వికేంద్రీక‌ర‌ణ‌పై అధికార వైసీపీ స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు నోటీసు ఇచ్చి చ‌ర్చ‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేస్తున్న‌ట్లు టీడీపీ నేత‌ల‌కు ఆ పార్టీ ప్ర‌భుత్వం ముందే స‌మాచారాన్ని లీక్ చేసింద‌ని, ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి ప‌రిధిలో టీడీపీ నేత‌లు భూములు కొన్నార‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ కుమారుడు విక్ర‌మ్ సింహా కూడా అమ‌రావ‌తిలో భూములు కొన్నార‌ని ఆయ‌న ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 

బుగ్గ‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న స‌మ‌యంలో స‌భ‌లోనే ఉన్న ప‌య్యావుల కేశ‌వ్‌.. బుగ్గ‌న ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే ఆయ‌న ఆరోప‌ణల‌కు స‌మాధానం ఇచ్చారు. త‌న కుమారుడి పేరిట రాజ‌ధాని అమ‌రావతిలో భూములు కొన్న మాట వాస్త‌వ‌మేన‌ని పయ్యావుల చెప్పారు. అయితే ఆ భూముల కొనుగోలు రాజ‌ధానిపై నాటి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత జ‌రిగింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఆ ప్రాంతంలో భూములు కొంటే త‌ప్పేముంద‌ని కూడా ప‌య్యావుల ప్ర‌శ్నించారు.

More Telugu News