Amaravati: తెనాలిలో ఐతానగర్ వైపు అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసుల అభ్యంతరం.. స్వల్ప ఉద్రిక్తత

  • వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని అభ్యంతరం  
  • రైతులకు సంఘీభావం తెలిపిన స్థానికులు  
  • చివరకు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లిన రైతులు
Police obstructed Amaravati farmers padayatra in Tenali

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. వీరి పాదయాత్ర తెనాలికి చేరుకున్న తర్వాత స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని ఐతా నగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. ఆ మార్గంలో వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని రైతులను ఆపేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను పెట్టారు. 

ఈ సందర్భంగా స్థానికులు రైతులకు సంఘీభావం తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మరోవైపు ఐకాస నేత గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ కోర్టు అనుమతులను ధిక్కరించకూడదు కాబట్టి... పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్టాండు ప్రాంతం మీదుగా చినరావూరు, జంగడిగూడెం మీదుగా సాయంత్రానికి పెదరావూరు చేరుకుంటామని చెప్పారు.

More Telugu News