Madhya Pradesh: నర్సరీ బాలికపై అత్యాచారం చేసిన స్కూలు బస్సు డ్రైవర్.. అక్రమ కట్టడమైన నిందితుడి ఇల్లు కూల్చివేత!

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
  • సహకరించిన బస్సులోని మహిళా హెల్పర్
  • ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
  • అధికారుల సమక్షంలో ఇంటి కూల్చివేత
Illegal house of Bhopal school bus driver who raped nursery student demolished

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో స్కూలు బస్సులోనే నర్సరీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్‌ అక్రమ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతున్న మూడున్నరేళ్ల బాలికపై నిందితుడైన డ్రైవర్ బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి బస్సులో ఉన్న మహిళా హెల్పర్ సహకరించడం గమనార్హం. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. 

నిందితుడు షాపూరా ప్రాంతం వసంత్ కుంజ్ సమీపంలోని గార్డెన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్రమంగా ఇంటిని నిర్మించుకున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా, ఆ ఇంటిని ఖాళీ చేయించి కూల్చివేశారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో ఇంటిని నేలమట్టం చేశారు.

బాలికపై అత్యాచారం ఘటన నేపథ్యంలో అమ్మాయిల స్కూలు బస్సులో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ అవినాష్ లావానియా ఆదేశించారు. అలాగే, బస్సులో సీసీటీవీ కెమెరాను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో స్కూలు యాజమాన్యానిదే బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. 

కుమార్తె శరీరంపై గాయాలు చూసిన తల్లి ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధిత బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని కలిసి విషయం చెప్పి ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌తోపాటు అతడికి సహకరించిన మహిళా హెల్పర్‌ను కూడా అరెస్ట్ చేశారు.

More Telugu News