Car: దర్జాగా డోర్‌ తీసుకుని కారు ఎక్కిన ఎలుగుబంటి.. వీడియో ఇదిగో

  • అమెరికాలోని కొలరాడోలో ఓ ఎలుగు బంటి తీరుపై అందరిలో ఆశ్చర్యం
  • మనుషులు తీసినట్టుగా కారు డోరు ఓపెన్ చేసుకుని లోనికి వెళ్లిన ఎలుగుబంటి
  • లోపల ఏమీ దొరక్కపోవడంతో కారు దిగి మెల్లగా వెళ్లిపోయిన వైనం
  • సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డయిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్
Bear opens Car door climbs inside

సాధారణంగా చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు కారు డోర్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. డోర్ పై ఉండే నాబ్ ను పట్టుకుని గట్టిగా లాగి తీయాల్సి ఉండటమే దీనికి కారణం. అలాంటిది ఓ ఎలుగు బంటి చాలా సులువుగా కారు డోర్ తీసుకుని, లోపలికి వెళితే.. చిత్రమే కదా. అమెరికాలోని కొలరాడోలో ఉన్న అల్లెన్స్ పార్క్ ప్రాంతంలో తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. 

అల్లెన్స్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతమంతా అడవులే. అక్కడ ఎలుగు బంట్ల సంఖ్య ఎక్కువ. ఇటీవల అడవిలోంచి ఓ ఎలుగుబంటి జనావాసాలున్న ప్రాంతంలోకి వచ్చింది. ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి వచ్చిన ఎలుగుబంటి.. మనుషులు తీసినట్టుగా చాలా ఈజీగా కారు డోరు ఓపెన్ చేసేసింది. డోర్ ను పూర్తిగా తెరిచి కారు లోపలికి వెళ్లింది. అంతా కలియ దిరిగి.. ఏమీ దొరకకపోవడంతో మెల్లగా కారులోంచి కిందికి దిగింది. అటూ ఇటూ చూస్తూ.. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ఎలుగు బంటి రావడం, కారు డోర్ తీసి ఎక్కడం, అటూ ఇటూ చూస్తూ తిరిగి వెళ్లిపోవడం అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. పొద్దున కారు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఏమిటా అని యజమాని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా.. ఎలుగుబంటి చేసిన పని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను స్థానిక అటవీ అధికారులకు పంపాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది.
హైబర్ నేషన్ కు ఆహారం కోసం..

  • ఎలుగు బంట్లు ఏటా శీతాకాలంలో దీర్ఘ నిద్ర (హైబర్ నేషన్) లోకి వెళతాయి. రెండు, మూడు నెలలు అలా నిద్రపోయేందుకు శరీరంలో అవసరమైన శక్తిని నిల్వ చేసుకుంటాయి. ఇందుకోసం ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని వెతుక్కుని తింటుంటాయి.
  • అడవిలో సరిగా ఆహారం దొరక్కపోవడంతో ఎలుగుబంట్లు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని కొలరాడో అటవీ అధికారులు తెలిపారు.
  • ఎలుగు బంట్లు కిటికీలు, తలుపులను కూడా సులువుగా తీయగలవని.. ఆయా ప్రాంతాల్లో జనం కిటికీలు, తలుపులకు గొళ్లెం వేసుకోవడం మర్చిపోవద్దని ప్రకటించారు.

More Telugu News