VRA: కేటీఆర్ హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమించిన వీఆర్ఏలు

  • డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి యత్నం
  • మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ లతో చర్చలు
  • చర్చలు సఫలం.. ఈ నెల 20న సంయుక్త సమావేశం
  • అప్పటివరకు వీఆర్ఏల శాంతియుత నిరసనలు
VRAs postpones strike in Telangana

తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కదిలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ లతో వీఆర్ఏ సంఘాల ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. కేటీఆర్ హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు వీఆర్ఏలు తెలిపారు. 

పే స్కేల్ అమలు, వారసులకు ఉద్యోగాలు (55 ఏళ్లకు పైబడినవారి వారసులు), అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర డిమాండ్లతో వీఆర్ఏలు సమ్మెకు దిగారు. దాంతో ప్రభుత్వం వీఆర్ఏలతో చర్చలకు ఉపక్రమించింది. మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ తో చర్చల అనంతరం వీఆర్ఏ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. 

తమ హామీలపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చాకే సమ్మె విరమించాలని భావించామని, కానీ కేటీఆర్ ఇచ్చిన హామీతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు శిబిరాల్లో శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ నెల 20న సంయుక్త సమావేశం ఉందని పేర్కొన్నారు. 

కాగా, గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్ ఎదుట ప్రస్తావించామని వీఆర్ఏ సంఘాల నేతలు వెల్లడించారు. కేసీఆర్ హామీ ఇచ్చినా, ఉన్నతాధికారుల అలసత్వం వల్లే తమకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని వారు ఆరోపించారు.

More Telugu News