Smriti Irani: కొత్త కళ్లద్దాలు కావాలా స్మృతీ జీ.. వీడియోతో కౌంటరిచ్చిన కాంగ్రెస్

  • స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అవమానించారన్న స్మృతి ఇరానీ
  • ఆమె వ్యాఖ్యల వీడియోకు వివేకానందుడికి రాహుల్ నివాళులు అర్పిస్తున్న వీడియోను జత చేసిన కాంగ్రెస్
  • మరింత స్పష్టంగా కనిపించేందుకు కొత్త కళ్లద్దాలు పంపిస్తామన్న జైరాం రమేశ్ 
congress counters Smriti Irani allegations with a Video

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర తర్వాత కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం కొనసాగుతోంది. తొలుత రాహుల్ గాంధీ ధరించిన టీ షర్టు ధరపై విమర్శలు సంధించిన బీజేపీ.. ఆ తర్వాత రాహుల్ ఓ పాస్టర్‌ను కలవడంపైనా విరుచుకుపడింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తూ వస్తోంది. 

తాజాగా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్‌‌ను ఏకం చేయాలంటూ యాత్ర ప్రారంభించిన రాహుల్.. కన్యాకుమారిలో వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా ఆయనను అగౌరవపర్చారని ఆరోపించారు. మంత్రి చేసిన ఈ ఆరోపణలకు కాంగ్రెస్ ఈసారి వీడియోతో బదులిచ్చింది.

కన్యాకుమారిలో రాహుల్‌గాంధీ స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్న వీడియోను స్మృతి చేసిన విమర్శల వీడియోకు జత చేసి గట్టి కౌంటర్ ఇచ్చింది. మరోవైపు, స్మృతి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ.. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ ముందు వరుసలో ఉంటుందని ఎద్దేవా చేశారు. స్వామి వివేకానందకు రాహుల్ నివాళులు అర్పించడం మరింత స్పష్టంగా కనిపించేందుకు అవసరమైతే కొత్త కళ్లద్దాలు పంపిస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News