Team India: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా ఎంపిక... జట్టు వివరాలు ఇవిగో!

  • అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్
  • ఆస్ట్రేలియా గడ్డపై మెగా ఈవెంట్
  • టీమిండియాను ప్రకటించిన సెలెక్టర్లు
  • దాదాపు పాత ఆటగాళ్లకే స్థానం
  • అశ్విన్ పై నమ్మకం
  • స్టాండ్ బైలుగా శ్రేయాస్ అయ్యర్, షమీ
Team India for T20 World Cup event announced

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది. జట్టులో పెద్దగా మార్పులేవీ లేవు. గాయంతో రవీంద్ర జడేజా జట్టుకు దూరమవడం తప్ప సంచలన నిర్ణయాలేవీ లేవు. దాదాపుగా పాత ఆటగాళ్లనే ఎంపిక చేశారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ లకు బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లకు జట్టులో చోటు కల్పించారు. 

ఇటీవల టీ20ల్లో ఏమంతగా రాణించని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై నమ్మకం ఉంచినట్టు అర్థమవుతోంది. యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా తమ స్థానాలను నిలుపుకున్నారు. ఇక శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీలను స్టాండ్ బై ఆటగాళ్లుగా తీసుకున్నారు. 

భారత జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.


స్టాండ్ బై ఆటగాళ్లు...
మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.


ఇక టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలుత తక్కువ ర్యాంకు జట్లతో గ్రూప్ దశ జరగనుండగా, టీమిండియా నేరుగా సూపర్-12 దశలో ఆడనుంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుండడం విశేషం. అక్టోబరు 23న జరిగే ఈ మ్యాచ్ కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది.

More Telugu News