amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

  • అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు పాదయాత్ర
  • వెయ్యి కిలోమీటర్ల మేర కొనసాగనున్న యాత్ర
  • రైతుల పాదయాత్రకు పలు రాజకీయ పార్టీల మద్దతు
Amaravati farmers padayatra started

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమయింది. వెంకటపాలెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామివారి రథాన్ని ముందుకు నడిపి పాదయాత్రను ప్రారంభించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. నవంబర్ 11న అరసవల్లిలో పాదయాత్ర ముగుస్తుంది. 

రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు విడతల వారీగా పాదయాత్రలో పాల్గొననున్నారు. 60 రోజుల పాటు 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తొలి రోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేస్తున్న వారు ఈ రాత్రికి మంగళగిరిలోనే బస చేయనున్నారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ పార్టీలకు చెందిన కొందరు నేతలు పాల్గొననున్నారు.

More Telugu News