India: పాకిస్తాన్ కు అమెరికా ఎఫ్-16 ప్యాకేజీని కొనసాగిస్తుండడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం

  • గతంలో పాక్ కు సాయం నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం
  • ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన బైడెన్ 
  • పాక్ కు ఎఫ్-16 విడిభాగాలు అందించాలని నిర్ణయం
  • మా భద్రతను పరిగణనలోకి తీసుకోవడంలేదంటూ భారత్ అసంతృప్తి
India raise concerns on US decision to continue F16 package to Pakistan

పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్-16 విమానాల విడిభాగాలను సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గత ఒప్పందంలో భాగంగానే విడిభాగాలు సరఫరా చేస్తున్నామని అమెరికా చెబుతున్నప్పటికీ భారత్ అసంతృప్తి చల్లారలేదు. అమెరికా సహాయమంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లుతో భారత్ నేరుగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

2 ప్లస్ 2 విధానంలో భారత్, అమెరికా మధ్య జరిగిన చర్చల్లో డొనాల్డ్ లు కూడా ఉన్నారు. పాక్ కు ఎఫ్-16 ప్యాకేజీ కొనసాగించాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు తమను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని భారత్ ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించింది. అమెరికా ఏకపక్ష వైఖరి తమను నిరాశకు గురిచేసే అంశమని స్పష్టం చేసింది. 

ఇది తమ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని భారత్... అమెరికా బృందంతో ఉద్ఘాటించింది. ఇకనైనా అమెరికా ప్రభుత్వం భారత్ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. 

కాగా, పాకిస్థాన్ కు సాయంపై గతంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు నిలిపివేత ధోరణి అవలంబించగా, జో బైడెన్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సమీక్షించి, పాక్ కు ఎఫ్-16 విడిభాగాల అందజేతకు నిర్ణయం తీసుకుంది.

More Telugu News