Passport: డ్రైవింగ్​ లైసెన్స్​, పాస్​ పోర్టు ఉండవు.. పుట్టిన రోజులేమో రెండు.. బ్రిటన్​ రాజుకు ఉండే ప్రత్యేకతలు ఇవిగో

  • అసలు పుట్టిన రోజు ప్యాలెస్ కే పరిమితం.. ప్రజలందరు జరుపుకొనేందుకు మరో పుట్టినరోజు
  • తన పేరిటే పాస్ పోర్టులు జారీ అవుతాయి కాబట్టి రాణి/రాజుకు పాస్ పోర్ట్ ఉండవు
  • ఎలాంటి ఎన్నికల్లో ఓటు వేయడం ఉండదు
No passport Two birthdays unusual monarchy facts

బ్రిటన్ కు రాణి ఉన్నా, రాజు ఉన్నా వారికంటూ కొన్నిరకాల ప్రత్యేక హక్కులు ఉంటాయి. మొత్తం సామ్రాజ్యాధినేత కాబట్టి.. వారి పేరిటే పరిపాలన సాగుతుంది కాబట్టి.. వారికి కొన్ని నియమాలు వర్తించవు. ఇవి బ్రిటిష్ రాచకుటుంబంలో కేవలం రాణి/రాజుకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా రాచ కుటుంబ సభ్యులు దేశంలో మిగతా పౌరుల తరహాలోనే అన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. బ్రిటన్ రాణి/రాజు అనుభవించే ఈ హక్కులు, ప్రత్యేకతల వివరాలు ఏమిటో చూద్దామా..

పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు
బ్రిటన్ లో పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు రాణి/రాజు ఆమోదం మేరకు జారీచేస్తున్నట్టుగా ఉంటాయి. అందువల్ల వారికి వారే పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసుకోవడం సరికాదన్న ఉద్దేశంతో వారికి ప్రత్యేక హక్కులు కల్పించారు. రాణి ఎలిజబెత్ 2 కు కూడా పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు ఉండేవి కాదు. ఇప్పుడు కొత్త రాజు చార్లెస్–3కు కూడా పాస్ పోర్టు ఉండదు. ఆయన ఏ దేశానికి వెళ్లినా రాజు హోదాలో వెళ్తారు. ఇక బ్రిటన్ లో ఆయన ఎలాంటి వాహనం నడిపినా సరే లైసెన్సు అవసరం ఉండదు.

రెండు పుట్టిన రోజులు
బ్రిటన్ రాణి/రాజులకు రెండు పుట్టినరోజులు ఉంటాయి. అసలైన పుట్టినరోజు ఒకటి ఉంటే.. ఏటా ఎండాకాలం కొనసాగే రోజుల్లో మరో తేదీని అధికారిక పుట్టినరోజుగా ఎంపిక చేస్తారు. అసలు పుట్టినరోజును ప్యాలెస్ లో జరుపుకొంటే.. అధికారిక పుట్టినరోజును ప్రజా వేడుకలుగా నిర్వహిస్తారు. 1,400 మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది మ్యూజిషియన్లు, మిలటరీ, వైమానిక విన్యాసాలతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. బ్రిటన్ లో వేసవిలో వాతావరణం బాగుంటుంది కాబట్టి.. ప్రజలంతా వేడుకలు చేసుకునేందుకు వేసవిలో అధికారిక పుట్టిన రోజును ఎంపిక చేసి నిర్వహిస్తారు.

  • రాణి ఎలిజబెత్–2 అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 కాగా.. ఏటా జూన్ లో వచ్చే రెండో మంగళవారాన్ని అధికారిక పుట్టిన రోజుగా జరిపేవారు.
  • కొత్త రాజు చార్లెస్–3 పుట్టిన రోజు నవంబర్ 14 కాగా.. వేసవిలో ఓ రోజును అధికారిక పుట్టినరోజుగా ఎంపిక చేయనున్నారు.

ఓటు వేయడం ఉండదు
బ్రిటన్ రాణి/రాజుగా ఉన్నవారు ఎన్నడూ, ఎలాంటి ఎన్నికల్లో ఓటు వేయడం ఉండదు. వారు రాజకీయాలకు పూర్తి అతీతంగా ఉండాలన్న ఉద్దేశంతో పూర్వంలోనే ఈ నిబంధన పెట్టారు. వారు కేవలం పార్లమెంటరీ సమావేశాల ప్రారంభం, చట్టాలను ఆమోదించడం, ప్రధాన మంత్రితో వారం వారం సమీక్షలకే పరిమితం అవుతారు.

అన్ని హంసలు, తిమింగలాలకు యజమాని
బ్రిటిష్ రాణి/ రాజు ఎవరు ఉన్నా.. ఇంగ్లండ్, వేల్స్ సముద్ర ప్రాంతాలు, నదుల్లోని హంసలు, డాల్ఫిన్లకు యజమానిగా ఉంటారు. 12వ శతాబ్దం నుంచీ ఈ ఆచారం కొనసాగుతోంది. డాల్ఫిన్లు, హంసల పరిరక్షణ కోసమే ఈ నిబంధన పెట్టుకున్నారట.

సంస్థలకు రాయల్ గుర్తింపు
బ్రిటిష్ రాచ కుటుంబానికి అవసరమైన సామగ్రి, సేవలను అందించే సంస్థలను ఎంపిక చేసి ‘రాయల్ వారంట్’ గుర్తింపు ఇచ్చే అధికారం రాజు/రాణికి ఉంటుంది. ఈ గుర్తింపు ఆయా సంస్థల ప్రతిష్టను పెంచుతాయి. ప్రజల్లోనూ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం బ్రిటిష్ రాచ కుటుంబానికి బర్బెరీ, కాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, సామ్సంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్ సంస్థలు ‘రాయల్ వారంట్’గా ఉన్నాయి.

More Telugu News