Uttar Pradesh: ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడు.. గుర్తించి రక్షించిన ‘ఫేస్‌బుక్’

  • నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు
  • ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును రియల్ టైం టెక్నాలజీ ద్వారా గుర్తించిన ఫేస్‌బుక్  
  • పోలీసులకు సమాచారం అందించడంతో రక్షించిన వైనం
Facebook SOS to UP Police saves life of NEET aspirant

నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఫేస్‌బుక్ రియల్‌టైం సాంకేతికత ఆ సందేశాన్ని గుర్తించడంతో ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. లక్నోకు చెందిన 29 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో పేర్కొన్నాడు. 

అయితే, అతడు పెట్టిన పోస్టును రియల్ టైం టెక్నాలజీ ద్వారా గుర్తించిన ఫేస్‌బుక్ వెంటనే యూపీ పోలీసులను అప్రమత్తం చేస్తూ మెసేజ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విద్యార్థి ఇంటికి చేరుకుని అతడిని రక్షించారు. 

కాగా, కుంగుబాటు, ప్రాణహాని పరిస్థితులకు సంబంధించిన పోస్టులు కనిపించినప్పుడు వెంటనే ఆ సమాచారం తమకు అందించాలంటూ ఫేస్‌బుక్, యూపీ పోలీసుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే తాజాగా విద్యార్థిని రక్షించడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు.

More Telugu News