Maha Padayatra: రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా

  • ఈ నెల 12న రైతుల మహా పాదయాత్ర
  • అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
  • గత రాత్రి నోటీసులు పంపిన డీజీపీ
  • హైకోర్టును ఆశ్రయించిన అమరావతి పరిరక్షణ సమితి
High Court gives nod to farmers to take up Maha Padayatra

రాజధాని అమరావతి రైతులు ఈ నెల 12న మహా పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో జరిపిన పాదయాత్ర సందర్భంగా రైతులు నిబంధనలు ఉల్లంఘించారంటూ డీజీపీ తాజా మహా పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. రైతులకు అనుమతి నిరాకరిస్తూ నిన్న రాత్రి డీజీపీ నోటీసులు ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మహా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

రైతుల పిటిషన్ ను నేటి మొదటి కేసుగా తీసుకుని విచారణ చేపట్టింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర సాగించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు స్పష్టం చేసింది. రైతుల దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది.

More Telugu News