Karnataka: స్కూల్‌లోనే మందుకొట్టి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు.. దొరికిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

  • కర్ణాటకలోని తుముకూరు తాలూకాలో ఘటన
  • 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని
  • స్కూల్లోనే మద్యం తాగి పాఠాలు
  • అకారణంగా విద్యార్థులపై దాడి
  • సస్పెండ్ చేసిన అధికారులు
karnataka drunk female teacher bar open in school alone

విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయిని ఆమె. 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కెరియర్‌లో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ, ఎందుకనో ఐదేళ్ల క్రితం ఆమె మద్యానికి అలవాటు పడ్డారు. అక్కడితో ఆగలేదు. నేరుగా పాఠశాలకే మద్యం సీసాలు తెచ్చుకుని తాగి పాఠాలు చెప్పేవారు. అకారణంగా పిల్లలపై చేయి చేసుకునేవారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు హెచ్చరించినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. చివరికి అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయి సస్పెండయ్యారు.

ఆమె పేరు గంగలక్ష్మమ్మ. కర్ణాటకలోని తుముకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఆమె మద్యం తాగి స్కూలుకు రావడం, విద్యార్థులను చితకబాదుతుండడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు తాజాగా స్కూలుకు చేరుకుని  పాఠశాలకు తాళం వేశారు. ఆపై టీచర్ గంగలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన తాలూకా విద్యాధికారి (బీఈవో) హనుమానాయక్‌కు గ్రామస్థులు పరిస్థితిని వివరించారు. దీంతో స్కూలు లోపలికి వెళ్లి ఉపాధ్యాయిని టేబుల్ డ్రా తెరిచేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు.

చివరికి డ్రా తాళాలు పగలగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసాతోపాటు రెండు ఖాళీ సీసాలు కనిపించాయి. అందరి ముందు రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయిన టీచర్ అవమానభారంతో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, గంగలక్ష్మమ్మను బయటకు తీసుకొచ్చారు. ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

More Telugu News