Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు... కోహ్లీ శతకానందం... టీమిండియా భారీ స్కోరు

  • ఆసియా కప్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘన్
  • ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ
  • 61 బంతుల్లో 122 నాటౌట్
  • 12 ఫోర్లు, 6 సిక్సులు బాదిన వైనం
  • టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 212-2
Kohli blasts super ceuntury

మూడేళ్లుగా తనను పట్టి పీడిస్తున్న పరుగుల కరవుకు విరాట్ కోహ్లీ ఓ అద్భుత శతకంతో తెరదించాడు. ఆఫ్ఘనిస్థాన్ తో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ భారీ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. 

ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే ఆఫ్ఘన్ బౌలర్లను ఎంతలా బాదాడో అర్థమవుతుంది. 2019 తర్వాత కోహ్లీకి ఇదే మొదటి శతకం కావడంతో ఈ ఇన్నింగ్స్ కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. 

ఇక కోహ్లీ సూపర్ సెంచరీ సాయంతో టీమిండియా ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ ఇన్నింగ్స్ లో హైలెట్ అంటే కోహ్లీ ఆటే. మైదానంలో అన్ని వైపులకు బంతిని పరుగులు తీయించిన కోహ్లీ ఓవరాల్ గా 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (71)తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. 

అంతేకాదు, అంతర్జాతీయ టీ20 పోటీల్లో కోహ్లీకిదే తొలి సెంచరీ. దాంతోపాటే, భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మన్ గానూ అవతరించాడు.

More Telugu News