Ratan Tata: సైరస్ మిస్త్రీ అంత్యక్రియలకు వీల్ చైర్ లో వచ్చిన రతన్ టాటా సవతి తల్లి

  • ముంబైలో ముగిసిన అంత్యక్రియలు
  • రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా హాజరు
  • టాటా గ్రూపు నుంచి అధికారంగా ఒక్కరూ రాని పరిస్థితి
Ratan Tatas stepmother attends Cyrus Mistry funeral in wheelchair

టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు మంగళవారం ముంబైలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి రతన్ టాటా సవతి తల్లి, 92 ఏళ్ల వయసున్న సిమోన్ టాటా వీల్ చైర్ లో వచ్చి మరీ నివాళి అర్పించారు. కానీ, టాటా గ్రూపు నుంచి అధికారికంగా ఎవరూ మిస్త్రీ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం జరగడం తెలిసిందే. 

టీసీఎస్ మాజీ హెడ్ ఎస్ రామదొరై సైతం పాల్గొన్నారు. మిస్త్రీ టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న సమయంలో కీలకంగా పనిచేసిన మధుకన్నన్ కూడా వచ్చారు. సైరస్ మిస్త్రీ పెద్దన్నయ్య షాపూర్ మిస్త్రీ, మావయ్య, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చగ్ల, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్ చంద్, దీపక్ పరేఖ్, విశాల్ కంపానీ, రోనీ స్క్రూవాలా, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిలింద్ దియోరా హాజరయ్యారు. 

మిస్త్రీ పార్సీ కుటుంబానికి చెందిన వారు. 2012 నుంచి 2016 వరకు టాటా సన్స్ చైర్మన్ గా పనిచేశారు. ఆయనపై విశ్వాసం పోయిందంటూ ఉన్నట్టుండి చైర్మన్ పదవి నుంచి టాటా గ్రూపు తప్పించింది. దీనిపై మిస్త్రీ కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఎంత న్యాయ వివాదం ఉన్నా కానీ, వ్యక్తి చనిపోయి అంతిమ సంస్కారం జరుగుతుంటే టాటా గ్రూపు నుంచి ఒక్కరూ రాకపోవడమే చర్చకు దారితీసింది.

More Telugu News