Karnataka: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి హఠాన్మరణం

  • బాత్రూములో జారిపడి గుండెపోటుకు గురైన మంత్రి
  • ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం బొమ్మై
Karnataka Minister Umesh Katti dies due to cardiac arrest

కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ కత్తి వయసు 61 సంవత్సరాలు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన నిన్న బాత్రూములో కాలుజారి కిందపడి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనలో అప్పటికే పల్స్ ఆగిపోయినట్టు వైద్యులు తెలిపారని రెవెన్యూ మంత్రి ఆర్. అశోక తెలిపారు. ఆయన మృతి బీజేపీకి తీరని లోటని అన్నారు.  

మంత్రి ఉమేశ్ కత్తి మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్ఘాంతపోయారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె.సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉమేశ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

బెల్గావి జిల్లా హుక్కేరి తాలూకాలోని బెల్లాబ్‌బాగేవాడిలో జన్మించిన ఉమేశ్ కత్తి హుక్కేరి నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణం తర్వాత ఉమేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పీఠంపై తనకున్న ఆకాంక్షను పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టిన ఉమేశ్.. ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు.

More Telugu News