Narendra Modi: భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్: ప్రధాని మోదీ

  • భారత్ పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
  • ఢిల్లీలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
  • బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని మోదీ వెల్లడి
  • భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని విశ్వాసం
PM Modi held bilateral talks with Bangladesh counterpart Sheikh Hasina

భారత పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆసియా వ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద విపణిగా ఉందని వెల్లడించారు. ఈ వాణిజ్య పురోగతిని మరింత ముందుకు తీసుకెళతామని, ద్యైపాక్షిక సమగ్ర ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు జరుపుతామని తెలిపారు. రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇవాళ ఆసియా ప్రాంతంలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్ అని, అభివృద్ధిలోనూ భారత్ కు బంగ్లాదేశ్ అతిపెద్ద భాగస్వామి అని మోదీ వివరించారు. ఇది ఇరుదేశాల ప్రజల మధ్య సహకారానికి సంబంధించిన విషయం అని, ఇది నిరంతరం పురోగమిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

ఐటీ, అంతరిక్ష పరిశోధనలు, అణు శక్తి విభాగంలోనూ పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించామంటూ మోదీ, షేక్ హసీనా ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. 

కాగా, ఈ సమావేశంలో జలవనరుల పంపకానికి సంబంధించి ఒప్పందాలపైనా నేతలు సంతకాలు చేశారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా 54 నదులు ప్రవహిస్తున్నాయని, ఇరుదేశాల ప్రజల జీవనోపాధికి ఈ నదులు దోహదపడుతున్నాయని నేతలు ఇరువురు వెల్లడించారు. ఇవాళ జరిగిన సమావేశంలో కుషియారా నదీ జలాల పంపకంపైనా ఒప్పందం చేసుకున్నామని వివరించారు.

More Telugu News