Andhra Pradesh: చ‌ర్చ‌ల‌కు పిలిచిన బొత్స‌... మధ్యలోనే బయటకు వచ్చేసిన ఉద్యోగ సంఘాలు

  • సీపీఎస్ ర‌ద్దుకు ఓకే చెప్పిన జ‌గ‌న్ స‌ర్కారు
  • దాని స్థానంలో జీపీఎస్ అమ‌లు చేస్తామ‌ని ప్ర‌తిపాద‌న‌
  • ఓపీఎస్ త‌ప్పించి మ‌రే ఇత‌రత్రా ఏ ప‌థ‌కాన్ని ఆమోదించేది లేదంటున్న ఉద్యోగులు
ap government invites employees associations for discussions over cps

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌) ర‌ద్దు కోరుతూ ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆందోళనల నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను చ‌ర్చ‌ల‌కు రావాలంటూ ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆహ్వానించారు. సీపీఎస్ ర‌ద్దు, దాని స్థానంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కొత్త పెన్ష‌న్ ప‌థ‌కంపై మంగ‌ళ‌వారం చ‌ర్చిద్దాం ర‌మ్మంటూ ఉద్యోగ సంఘాల‌కు బొత్స ఆహ్వానం ప‌లికారు. బొత్స ఆహ్వానం మేర‌కు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లారు.

అయితే ఎప్పటిమాదిరే సీపీఎస్ రద్దుకు ఓకే చెప్పిన మంత్రుల కమిటీ దాని స్థానంలో జీపీఎస్ ను అమలు చేస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇదివరకే నో చెప్పిన ఉద్యోగ సంఘాలు... మంగళవారం నాటి చర్చల్లోనూ అదే ప్రతిపాదన రావడంతో చర్చల నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిపాయి. పాత ప్రతిపాదనలనే మళ్లీ తెర ముందుకు తేవడంతో తాము చర్చల నుంచి బయటకు వచ్చేశామని తెలిపాయి. 

సీపీఎస్ ర‌ద్దుకు ఓకే చెప్పిన ప్ర‌భుత్వం... దాని స్థానంలో గ్యారెంటీ పెన్ష‌న్ స్కీం (జీపీఎస్‌)ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పింది. అయితే ఓల్డ్ పెన్ష‌న్ స్కీం (ఓపీఎస్‌) మిన‌హా మ‌రే ఇత‌ర పెన్ష‌న్ స్కీం త‌మ‌కు ఆమోద‌యోగ్యం కాద‌ని ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నాటి చ‌ర్చ‌ల్లో కూడా బొత్స నోట నుంచి జీపీఎస్ మాటే వినిపిస్తే ఏం చేయాల‌న్న దానిపై సమాలోచనలు చేసిన ఉద్యోగ సంఘాల నేత‌లు చివరకు బొత్స ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లారు.

More Telugu News