Ram Gopal Varma: 'కేజీఎఫ్ 2', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 'కేజీఎఫ్ 2' చిత్రం బాలీవుడ్ లో చాలా మందికి నచ్చలేదన్న వర్మ 
  • వాస్తవికతకు దూరంగా ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడని వ్యాఖ్య 
  • అంచనాలు లేకుండా వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' రూ. 250 కోట్లు వసూలు చేసిందని వెల్లడి 
Ram Gopal Varma sensational comments on KGF 2 and The Kashmir Files

'కేజీఎఫ్ 2', 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్ 2' చిత్రం ఏకంగా రూ. 1,250 కోట్లను వసూలు చేసింది. మరోవైపు ఈ రెండు చిత్రాలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'కేజీఎఫ్ 2' చిత్రం బాలీవుడ్ లో చాలా మందికి నచ్చలేదని వర్మ అన్నారు. సినిమాను చూసిన ఓ బాలీవుడ్ బడా దర్శకుడు తనకు ఫోన్ చేశాడని... అరగంట సినిమా చూసే సరికి బోర్ కొట్టిందని చెప్పాడని తెలిపారు. అయితే వాళ్లకు తాను చెప్పేది ఒకటేనని... సినిమా నచ్చినా, నచ్చకపోయినా... అది సాధించిన ఘన విజయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. 

వాస్తవికతకు దూరంగా ఒక అసహజమైన రీతిలో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడని తెలిపారు. రాఖీ బాయ్ మెషిన్ గన్ తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయని... ఇది తనకు చాలా విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పలేనని... అయితే కొన్ని సీన్లను మాత్రం నోరెళ్లబెట్టుకుని చూశానని అన్నారు. 

ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'ది కశ్మీర్ ఫైల్స్' ఒకటని వర్మ చెప్పారు. బాలీవుడ్ సైతం పట్టించుకోని ఒక దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ సినిమాలో నటించిన వారిలో కూడా కేవలం అనుపమ్ ఖేర్ మాత్రమే అందరికీ తెలుసని చెప్పారు. 

ఇలాంటి ఏ మాత్రం అంచనాలు లేని సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదని అన్నారు. ఆ సినిమాకు సరైన స్క్రీన్ ప్లే లేదని... ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా సరిగా లేదని... అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు. ఈ సినిమాను చూసినంత సీరియస్ గా గత 20 ఏళ్లలో ఏ సినిమాను చూసి ఉండరని అన్నారు.

More Telugu News