Team India: అర్ష్​ దీప్​ ను తిట్టొద్దు.. అతను ‘గోల్డ్​’ అంటున్న మాజీ స్పిన్నర్​

  • ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్ 
  • కీలక సమయంలో సులువైన క్యాచ్ ను వదిలేసిన పేసర్ అర్ష్ దీప్
  • అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శులు
  • మద్దతుగా నిలిచిన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్
Arshdeep Is Gold Former India Spinner Backs Young Seamer After Dropped Catch vs Pakistan

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన సూపర్ 4 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి ఓవర్ వరకూ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ పోరులో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్ వైఫల్యమే భారత జట్టుకు కారణమైంది. అదే సమయంలో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో యువ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ సులభమైన క్యాచ్ ను వదలేయడం కూడా దెబ్బకొట్టింది. అతను క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన ఆసిఫ్ అలీ వరుసగా ఫోర్లు, సిక్సర్లతో పాక్ ను గెలిపించాడు.  కీలక సమయంలో అంత సులువైన క్యాచ్ వదిలేసిన అర్ష్ దీప్ భారత్ ఓటమికి కారణమయ్యాడంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. 

సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్న అర్ష్‌ దీప్‌ సింగ్ కు భారత మాజీ క్రికెటర్లు అండగా నిలిచారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లను వదలరని, యువ బౌలర్ ను తిట్టొద్దని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ న్నాడు. ‘యంగ్ స్టర్ అర్ష్ దీప్ ను విమర్శించడం మానేయండి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌ను వదిలేయరు. మన ఆటగాళ్ల గురించి మనం గర్వపడాలి. ఆ రోజు పాకిస్థాన్ బాగా ఆడింది అంతే. సోషల్ మీడియా వేదికగా చౌకబారు మాటలతో అర్ష్ దీప్, జట్టును తిట్టడం సిగ్గుచేటు. అర్ష్ దీప్ బంగారం’ అని హర్భజన్ ట్వీట్ చేశాడు. 

భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అర్ష్ దీప్ కు మద్దతు తెలిపాడు. యువ బౌలర్ ది బలమైన వ్యక్తిత్వం అన్నాడు. అతడిని అలానే ఉంచాలని అభిమానులకు సూచించాడు. పాక్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ కూడా భారత బౌలర్ కు సపోర్ట్ గా నిలిచాడు. ‘భారత అభిమానులందరికీ విజ్ఞప్తి. మేం కూడా మనుషులమే. ఆటలో తప్పులు చేస్తుంటాం. ఇలాంటి తప్పులు చేసిన అర్ష్ దీప్ లాంటి వాళ్లను దయ చేసి హేళన చేయొద్దు’ అని ట్వీట్ చేశాడు. 

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కూడా అర్ష్‌ దీప్‌ కు తన మద్దతును తెలిపాడు. ‘అధిక ఒత్తిడితో కూడిన ఇలాంటి మ్యాచ్ ల్లో తప్పులు జరుగుతుంటాయి. నా మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ లో భాగంగా నేను షాహిద్ అఫ్రిది బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి ఔటయ్యా. దాంతో,  ఆ రోజు ఉదయం 5 గంటల వరకు నాకు నిద్ర పట్టలేదు. అక్కడితోనే నా కెరీర్ ముగిసిందని అనుకున్నా. ఆటగాళ్ళు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి ఎవరైనా అతని తప్పును అంగీకరించాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

More Telugu News