Virat Kohli: ఆటకు దూరంగా ఉన్నప్పుడు ఆ విషయాల గురించే ఆలోచించా: విరాట్​ కోహ్లీ

  • ఆసియా కప్ నకు ముందు కావాలనే బ్రేక్ తీసుకున్నానని వెల్లడి
  • ఈ సమయంలో మరింత ఉత్సాహంగా తిరిగి రావడంపై దృష్టి పెట్టానన్న భారత మాజీ కెప్టెన్
  • తన ఆట గురించి ఎవరేం అనుకున్న పట్టించుకోనన్న విరాట్
Focused on working hard and giving my best during my break Virat Kohli

రెండు నెలల విరామం తర్వాత ఆసియా కప్‌లో తిరిగి బరిలోకి దిగే ముందు తనపై విమర్శకులకు సమాధానం చెప్పడం గురించి ఆలోచించలేదని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. కష్టపడి పనిచేయడం, జట్టు కోసం తన శక్తి మేరకు కృషి చేయడం గురించే ఆలోచించాని చెప్పాడు. తన ఆట గురించి ఎవరేం అనుకున్నా తను పట్టించుకోనని, అది తన ఆనందాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదని చెప్పాడు. ఆసియా కప్‌లో  భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులతో టోర్నీలో రెండో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ, భారీ స్కోరు కాపాడుకోలేకపోయిన భారత్ ఓడిపోయింది. 

మ్యాచ్ తర్వాత విరాట్మీడియాతో మాట్లాడాడు. ‘విమర్శకులకు సమాధానం ఇవ్వడంపై నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు. నేను 14 సంవత్సరాలుగా ఆడుతున్నా. కష్టపడి ఆడటమే నా పని. నేను దానిపై దృష్టి పెట్టా. జట్టు విజయం కోసం నా ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం కోసం కృషి చేస్తూనే ఉంటా. విమర్శకులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. మా పని ఆట ఆడటం, కష్టపడి పనిచేయడం, మా 120 శాతం ఇవ్వడమే. నేను అలా చేస్తున్నంత కాలం, నాపై జట్టుకు నమ్మకం ఉన్నంత వరకు, డ్రెస్సింగ్ రూమ్ లో  ఏ జరుగుందనేది మాత్రమే మాకు ముఖ్యం. మిగతా నా విషయంలో ప్రజలకు వివిధ అభిప్రాయాలు ఉండొచ్చు. అది మంచిదే. కానీ, ఇది ఒక వ్యక్తిగా నా ఆనందాన్ని మార్చదు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఆసియా కప్‌కు ముందు తాను విరామం కోరుకున్నానని చెప్పాడు. ఆటకు దూరంగా ఉన్న ఈ సమయంలో క్రికెట్ ఆడేందుకు ఉత్సాహాన్ని తిరిగి పొందగలిగానన్నాడు. విరామం నుంచి తిరిగి వచ్చినప్పుడు  డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం తనను స్వాగతించేలా ఉందన్నాడు. దాంతో, మరోసారి తన ఆటను ఆస్వాదించడం ప్రారంభించాడని కోహ్లీ చెప్పాడు. ‘కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని నేను కొంత సమయం విశ్రాంతి తీసుకున్నా. ఇది నాకు అవసరమైన కాస్త విరామాన్ని ఇచ్చింది తప్పితే నా కెరీర్ కు ముగింపు కాదు. అంచనాల ఒత్తిడిని నాపై పెట్టుకోకూడదని జీవితంలో నేను గ్రహించా. అందుకే తిరిగి ఆడటం మొదలు పెట్టి.. ఆ ఉత్సాహాన్ని తిరిగి పొందగలిగాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు (ఆసియా కప్) వాతావరణం స్వాగతించింది. నా సహచరులతో స్నేహం అద్భుతమైనది. జట్టులోని వాతావరణం అద్భుతంగా ఉంది. నేను మళ్లీ మళ్లీ ఆడేందుకు ఇష్టపడుతున్నా. అలాగే, నా బ్యాటింగ్‌ పై పూర్తి సంతృప్తిగా ఉన్నా’ అని కోహ్లీ వివరించాడు. 

More Telugu News