UK: మరి కాసేపట్లో బ్రిటన్ ప్రధాని ఎన్నిక ఫలితాలు.. రిషి సునక్​ గెలిచేది కష్టమే!

  • సర్వేలన్నీ లిజ్ ట్రస్ వైపే మొగ్గు
  • ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా పోటీ పడ్డ రిషి, ట్రస్
  • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త ప్రధాని
UK to declare new PM today Lizz Truss ahead of Rishi Sunak

ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్ ను పాలించే కొత్త ప్రధాన మంత్రి ఎవరో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. నూతన ప్రధాని కోసం జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడవనున్నాయి. ప్రధాని పదవి కోసం భారత సంతతి వ్యక్తి అయిన రిషి సునక్, ప్రస్తుత విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ హోరాహోరీగా పోటీ పడ్డారు. 

ఈ నేపథ్యంలో తొలిసారి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారా? లేక బ్రిటన్ కు మూడో మహిళా ప్రధానిగా ట్రస్ వస్తారా? అన్నది తేలిపోనుంది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకల్లా ఫలితం తేలిపోతుంది. మాజీ ఆర్థిక మంత్రి అయిన 42 ఏళ్ల రిషి సునక్, 47 ఏళ్ల లిజ్ ట్రస్ ఎన్నికల కోసం పోటాపోటీగా ప్రచారం చేశారు. ఇద్దరి మధ్య మొదటి నుంచి గట్టి పోటీ నడిచింది. కానీ, ఎన్నికకు సమయం చేరువయ్యే కొద్దీ రేసులో రిషి వెనుకబడగా... లిజ్ ముందుకొచ్చారు. ఈ ఎన్నికపై జరిగిన అన్ని సర్వేలూ లిజ్ ట్రస్ కే విజయం దక్కుతుందని అంచనా వేశాయి.

కాగా, కరోనా నిబంధనలు పాటించకుండా పార్టీల్లో పాల్గొని, ఇతర వివాదాల్లో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన స్థానంలో కొత్త ప్రధాని, అధికార కన్జర్వేటివ్ పార్టీ నూతన నాయకుడి ఎన్నిక కోసం పార్టీలో జరిగిన ఓటింగ్ శుక్రవారం ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతి రోజు, అంటే మంగళవారం బోరిస్ జాన్సన్ తన అధికారిక రాజీనామాను క్వీన్ ఎలిజబెత్ 2 కు ఇస్తారు. ఆమె సమక్షంలోనే  కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారు.

More Telugu News