KK Shailaja Teacher: రామన్ మెగసెసే పురస్కారాన్ని తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజ

  • ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట అవార్డు
  • మెగసెసేపై కమ్యూనిస్టు వ్యతిరేకి అన్న ముద్ర
  • అవార్డుపై సీపీఎం కేంద్ర కమిటీతో చర్చించిన శైలజ
  • అవార్డు తీసుకోరాదని నిర్ణయం
Kerala former health minister KK Shailaja Teacher rejects Raman Magsaysay award

నోబెల్ బహుమతి తర్వాత అంతటి విశిష్టత కలిగిన అవార్డు రామన్ మెగసెసే పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ అవార్డు ఏర్పాటు చేశారు. కాగా, కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజకు రామన్ మెగసెసే అవార్డు ప్రకటించగా, ఆమె తిరస్కరించారు. 

ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసేకు కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే తాను ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును స్వీకరించడంలేదని కేకే శైలజ వెల్లడించారు. ఈ పురస్కారంపై వ్యక్తిగతంగా తనకేమంత ఆసక్తి లేదని అన్నారు. 

కేకే శైలజ నిర్ణయాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమర్థించారు. ఫిలిప్పీన్స్ లో కమ్యూనిస్టుల పట్ల దారుణంగా వ్యవహరించిన చరిత్ర రామన్ మెగసెసేదని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేకే శైలజ రామన్ మెగసెసే అవార్డును మర్యాదపూర్వకంగా తిరస్కరించారని సీతారాం ఏచూరి వెల్లడించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన కేకే శైలజ.... పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాతే ఈ అవార్డును తీసుకోరాదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News