Malappuram: జేసీబీతో చెట్టు కూల్చివేత.. పదుల సంఖ్యలో పక్షుల మృతి.. గుండెలు పిండేసే వీడియో ఇదిగో!

  • వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్
  • చెట్టుకింద నలిగి మరణించిన పక్షులు
  • హృదయ విదారకంగా ఉన్న వీడియో
  • జేసీబీ డ్రైవర్ అరెస్ట్
  • క్రూరమైన చర్యగా అభివర్ణించిన అటవీశాఖ మంత్రి
Baby birds fall to death after tree gets chopped down in Kerala

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని గుండెలు పిండేస్తూ బోల్డంత విషాదాన్ని మోసుకొస్తాయి. మనుషుల కర్కశత్వాన్ని కళ్లకు చాటుతాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో ఇలాంటిదే. ఇది చూసిన నెటిజన్ల హృదయాలు ద్రవించిపోతున్నాయి. 44 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఓ చెట్టు కూల్చివేతకు సంబంధించినది. కేరళలోని మలప్పరం జిల్లాలో జరిగింది. 

రోడ్డు పక్కనున్న ఓ చెట్టును జేసీబీతో కూల్చివేస్తున్నారు. ఆ విషయం తెలియని వందలాది పక్షులు చెట్టుపై కట్టుకున్న గూళ్లలో ఉన్న తమ పిల్లలకు ఆహారం అందించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో చెట్టు ఒక్కసారిగా కూలి నేలపడింది. ఆ మరుక్షణమే అక్కడి పరిస్థితి హృదయాలను కదిలించింది. చెట్టు కూలుతున్నప్పుడే కొన్ని పక్షులు ఎగిరిపోగా మరికొన్ని మాత్రం దానికింద పడి నలిగిపోయాయి. దీంతో ఆ ప్రదేశమంతా పక్షుల కళేబరాలు, గూళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసినవారి కళ్లు బాధతో చెమర్చాయి.

ఈ వీడియోను పోస్టు చేసిన కశ్వాన్.. ‘ప్రతి ఒక్కరికీ ఇల్లు కావాలి, మనమెంత క్రూరంగా తయారవుతున్నాం’ అని క్యాప్షన్ తగిలించారు. ఇది ఎక్కడ జరిగిందో తనకు తెలియదని ఆయన పేర్కొన్నప్పటికీ మలప్పరం జిల్లా తిరునంగడిలోని వీకే పడిలో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో అటవీ అధికారులు స్పందించారు.  వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. చెట్టును కూల్చిన జేసీబీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. 

జాతీయ రహదారి విస్తరణలో భాగంగానే చెట్టును కూల్చివేసినట్టు తెలుస్తోంది. దానిని కూల్చినప్పుడు అక్కడే ఉన్న జనం ఆ తర్వాత జరిగింది చూసి నిర్ఘాంతపోయి కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, అనుమతి లేకుండానే చెట్టు కూల్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మాట్లాడుతూ.. దీనిని క్రూరమైన ఘటనగా అభివర్ణించారు. అటవీశాఖ అనుమతి లేకుండానే చెట్టును కూల్చారని చెప్పారు. చెట్టుపై పక్షులు, గూళ్లు ఉన్నప్పుడు దానిని కూల్చకూడదన్న కఠిన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ముహమ్మద్ రియాస్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్ఏఐ) నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని నిలంబూర్ నార్త్ డివిజనల్ అధికారి పేర్కొన్నారు. కాగా, వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు. రీట్వీట్లు, కామెంట్లకు కొదవే లేదు.

More Telugu News