Sri Lanka: శ్రీలంకకు తిరిగొచ్చిన మాజీ అధ్యక్షుడు గొటబాయ.. స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీలు

  • శుక్రవారం అర్ధరాత్రి బ్యాంకాక్ నుంచి కొలంబోకు చేరిక
  • భారీ భద్రత నడుమ ప్రభుత్వం కేటాయించిన బంగ్లాకు చేరుకున్న రాజపక్స 
  • ఏడు వారాల తర్వాత స్వదేశానికి వచ్చిన గొటబాయ
Sri Lanka former president Gotabaya Rajapaksa returns home after fleeing

దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంకకు తిరిగొచ్చారు. దాదాపు ఏడు వారాల తర్వాత ఆయన తిరిగి శ్రీలంకలో అడుగు పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. 

అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్ పీపీ) పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతల నుంచి స్వాగతం అందుకున్న తర్వాత సైన్యం భారీ భద్రత నడుమ విమానాశ్రయం నుంచి బయల్దేరి రాజధాని కొలంబోలో మాజీ అధ్యక్షుడిగా ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటికి చేరుకున్నారు. గొటబాయ రాజపక్స తన పదవి నుంచి వైదొలగిన తర్వాత శ్రీలంక పార్లమెంటు అప్పటి తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేను శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు, తిరుగుబాటు రావడంతో దిక్కులేని పరిస్థితుల్లో గొటబాయ రాజపక్స ఈ ఏడాది జులై 13న దేశం నుంచి పరారయ్యారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో వైమానిక దళ విమానంలో తొలుత మాల్దీవులకు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడి నుంచి అధికారికంగా తన రాజీనామా లేఖ పంపించి రెండు వారాల తర్వాత థాయ్‌లాండ్‌కు వెళ్లారు. తమ దేశంలో ఉండేందుకు రాజపక్సకు థాయ్ లాండ్ ప్రభుత్వం 90 రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే, గడువుకు ముందే స్వదేశానికి రావాలని రాజపక్స నిర్ణయించుకున్నారు. రాజపక్సపై కోర్టు కేసులు గానీ, అరెస్ట్ వారెంట్ గానీ పెండింగ్‌లో లేవు.

More Telugu News