Warning Signs: ఈ సంకేతాలు కనిపిస్తే.. బ్లడ్ షుగర్ అధికంగా ఉన్నట్టే!

  • అలసట, దాహం, అధికంగా మూత్రవిసర్జన
  • ఆకలి పెరిగి, బరువు తగ్గిపోవడం కూడా సమస్యకు సూచనే
  • కంటి చూపు తగ్గిపోతుంటే నిర్లక్ష్యం పనికిరాదు
Warning Signs Your Blood Sugar is Dangerously High

రక్తంలో చక్కెరలు ఎప్పుడూ పరిమిత మోతాదులోనే ఉండాలి. లేదంటే అది మధుమేహంగా మారుతుంది. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చు, తగ్గులు ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్ కు దారితీయవచ్చు. అసలు రక్తంలో చక్కెరలు ఎందుకు? శక్తి కోసం. శరీరం ఇన్సులిన్ ను తగినంత ఉత్పత్తి చేయలేనప్పుడు ఏర్పడేదే మధుమేహం. 

ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 180 ఉందంటే దాన్ని అధిక స్థాయిగానే పరిగణించాలి. 100 నుంచి 125 మధ్య ఉంటే.. అంతకుముందు 8 గంటల నుంచి ఏమీ తినకపోతే అప్పుడు కూడా దీన్ని అధిక స్థాయిగానే పరిగణించాలి. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. 

కానీ, వచ్చిన తర్వాత డయాబెటిస్ కు వెంటనే చికిత్స అవసరం. లేదంటే రక్తనాళాలు దెబ్బతింటాయి. అయితే, తమకు అధిక బ్లడ్ గ్లూకోజు ఉన్నట్టు కొందరికి తెలియదు. కొన్ని సంకేతాలు కనిపిస్తున్నా.. వాటిని మధుమేహ లక్షణాలుగా అర్థం చేసుకోరు. కొత్తగా మధుమేహం బారిన పడినవారే కాకుండా, ఈ సమస్య ఉండి నియంత్రణలో లేని వారికి సైతం ఇదే మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. 

అలసట..
రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉంటే అదనపు శక్తి అనుకోవద్దు. గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పటికీ శరీరం శక్తిగా మార్చుకోలేని స్థితి అది. దీంతో శక్తి చాలక అలసట అనిపిస్తుంది.

మూత్ర విసర్జన
మూత్ర పిండాలు రక్తంలో అధికంగా ఉన్న షుగర్ ను వడ కట్టలేవు. కానీ, అధికంగా ఉన్న గ్లూకోజ్ ను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది.  దీంతో అధికంగా, తరచూ మూత్ర విసర్జన అవసర పడుతుంది. దీంతో దాహం వేసి ఎక్కువ నీరు తీసుకుంటారు. 

బరువు తగ్గడం
ఆకలి పెరిగి, అదే సమయంలో బరువు తగ్గారంటే అది కచ్చితంగా మధుమేహం సూచనగానే చూడాలి. రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉన్నా, ఇన్సులిన్ లేమి కారణంగా దాన్ని శరీరం ఉపయోగించుకోలేదు. దీనికి బదులు స్టోర్ లో ఉన్న కొవ్వులను ఉపయోగించుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు.

కంటి చూపు
రక్తంలో గ్లూకోజు పెరగడం వల్ల కంటి వెనుక భాగంలో రక్తనాళాల పరిమాణం పెరుగుతుంది. ఇదే కంటి చూపు తగ్గిపోయేందుకు దారితీస్తుంది.

తిమ్మిర్లు, జలదరింపులు
రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయుల్లో ఉంటే అది రక్తనాళాలు దెబ్బతినేందుకు దారితీస్తుందని విన్నాం. దీంతో రక్తప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా తిమ్మిర్లు (మొద్దు బారడం), జలదరింపులు ఉంటాయి.

More Telugu News