Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు శ్రీలంక, ముంబై, బహ్రెయిన్​ లో ఇళ్లు కొనిచ్చిన ఆర్థిక నేరగాడు సుఖేశ్!

  • తమ చార్జిషీట్లో పేర్కొన్న ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్
  • జాక్వెలిన్ ను పరిచయం చేసినందుకు సహచరుడికి కోట్లు నజరానాగా ఇచ్చిన సుఖేశ్
  • ఈనెల 26న విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ నటికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Jacqueline Fernandez gets Homes in Sri Lanka Bahrain Mumbai from conman sukesh

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. సుఖేశ్ చంద్రశేఖర్‌పై న‌మోదైన రూ.200 కోట్ల మనీ ల్యాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేరుస్తూ ఈడీ గ‌తంలోనే కేసు న‌మోదు చేసింది. జాక్వెలిన్ కోసం సుఖేశ్ ఆమె స్వదేశం అయిన శ్రీలంకలో ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

అలాగే, ముంబైలో అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో కూడా ఓ బంగ్లా కోసం అడ్వాన్స్ ఇచ్చాడు. వీటితో పాటు జాక్వెలిన్ తల్లిదండ్రుల కోసం బహ్రెయిన్ లో ఓ ఇల్లు కొని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో పేర్కొంది.  

ఈడీ వివరాల ప్రకారం ఇళ్లు కొనుగోలు పనిని సుఖేశ్ తన సహచరుడు పింకీ ఇరానీకి అప్పచెప్పినట్లు తెలిసింది. సుఖేశ్ కు జాక్వెలిన్ ను ఇరానీనే పరిచయం చేశాడు. ఇందుకు ఇరానీకి సుఖేశ్ కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

‘ముంబైలోని జుహు బీచ్ ప్రాంతంలో జాక్వెలిన్‌కు ఇల్లు కొనడానికి కొంత టోకెన్ డబ్బు ఇచ్చారు. బహ్రెయిన్‌లోని నటి తల్లిదండ్రులకు అతను ఇప్పటికే ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా, శ్రీలంకలో ఇల్లు కొనడానికి చర్చలు జరిపారు’ అని ఛార్జిషీట్ వెల్లడించింది. 

దీని గురించి అధికారులు జాక్వెలిన్‌ను ప్రశ్నించగా, శ్రీలంకలో తన కోసం ఒక ఇంటి గురించి సుఖేశ్ తనతో చెప్పాడని, అయితే తానెప్పుడూ అక్కడికి వెళ్లలేదని ఆమె అంగీకరించింది. ‘సుఖేశ్ తన కోసం శ్రీలంకలో కొత్త ఇల్లు కొన్నాడని నిందితుడు పింకీ ఇరానీతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా.. సుఖేశ్ తన కోసం శ్రీలంకలోని వెలిగామాలో ఆస్తిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. అయితే, తానెప్పుడూ ఈ ఇంటిని సందర్శించలేదని చెప్పారు’ అని ఛార్జిషీట్ లో పేర్కొంది. వెలిగామ అనేది శ్రీలంకలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ కావడం విశేషం. 

తనకు, లేదా తన బంధువులకు మరికొన్ని ఆస్తులు కొనుగోలు చేయాలనే సుఖేశ్ ప్రణాళికలను కూడా జాక్వెలిన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఆస్తులను సుఖేశ్ నిజంగానే కొనుగోలు చేశాడా? లేక జాక్వెలిన్ కు అతను అబద్ధం చెప్పాడా? అనే విషయాన్ని ఈడీ ఇంకా నిర్ధారించలేదు. 

ఒకవేళ ఇస్తే ఆర్థిక నేరాల ద్వారా సంపాదించిన మొత్తంతోనే వీటిని కొన్నారా? అనే కోణంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. కాగా, జాక్వెలిన్ కు సుఖేశ్ చంద్రశేఖర్ రూ.7 కోట్లకు పైగా నగలు బహుమతిగా ఇచ్చాడ ని ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు అనేక ఖరీదైన కార్లు, బ్యాగులు, దుస్తులు, బూట్లు, గడియారాలు  కూడా బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. 

సుఖేశ్ పాల్పడిన మనీ ల్యాండ‌రింగ్‌ కేసుల్లో జాక్వెలిన్‌ పాత్రపై కూడా ఈడీ విచారణ చేపడుతోంది. మరోపక్క, ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ నెల 26న త‌మ ముందు హాజ‌రు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది.

More Telugu News