Mamata Banerjee: నా ఆస్తులు అక్రమమైతే వెంటనే బుల్డోజర్లతో కూల్చేయండి: చీఫ్ సెక్రటరీని ఆదేశించిన మమతా బెనర్జీ

  • మమత బంధువుల ఆస్తులపై విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిల్
  • తాను రాజకీయాల్లోకి వచ్చింది సేవ కోసమేనన్న మమత
  • ప్రజలను అన్ని వేళలా మోసం చేయడం సాధ్యం కాదన్న సీఎం
Bulldoze my properties says mamata banerjee

తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. తన ఆస్తులపై విచారణ జరిపించి అక్రమమని తేలితే కూల్చివేయాలని సూచించారు. మమత, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తన కుటుంబ సభ్యులకు నోటీసులు అందితే చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ప్రస్తుత రోజుల్లో అది కష్టమైనా పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. 

‘‘ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్నానని మీరు ఆరోపిస్తున్నారు. కాబట్టి నా ఆస్తులపై విచారణ జరిపించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించాను. అక్రమమని తేలితే బుల్డోజర్లు ఉపయోగించి కూల్చేయమని ఆదేశించాను’’ అని మమత పేర్కొన్నారు. కాగా, మమత బెనర్జీ బంధువుల ఆస్తుల్లో ఇటీవల విపరీతమైన పెరుగుదల కనిపించిందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 

‘‘మీరు గతంలో ఇలాంటివి చూశారేమో. నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ కోసమే. బొగ్గు నుంచి వచ్చిన సొమ్ము మొత్తం కాళీఘాట్‌కు చేరుతోందని వారు అంటున్నారు. కాళీఘాట్ ఎక్కడుందో చెప్పండి? పశువులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి. వాటికేం సాయం కావాలన్నా చేస్తా. అదంతా హోంమంత్రి బాధ్యత. ప్రజలను ఏ ఒక్కరు అన్ని వేళలా మోసం చేయలేరు’’ అని మమత మండిపడ్డారు. 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బొగ్గు అక్రమ రవాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీని శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ ఈడీ తాజా సమన్లలో ఆదేశించింది.

More Telugu News