CM Kcr: జవాన్ల త్యాగం వెలకట్టలేనిది.. అండగా ఉంటాం: సీఎం కేసీఆర్

  • బీహార్ లో అమర జవాన్లు, వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
  • ఆ రాష్ట్ర సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీలతో కేసీఆర్ భేటీ
  • తెలంగాణ ఆర్థిక సాయానికి ధన్యవాదాలు తెలిపిన నితీశ్ కుమార్
CM KCR at patna tour

దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారని.. వారి త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు సైనికులకు అండగా ఉంటారని చెప్పారు. చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ ఘటనలో అమరులైన ఐదుగురు బీహార్‌ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బీహార్ లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వలస కార్మికులకు అండగా ఉంటాం..
బీహార్‌లో జరిగిన ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని.. వారిని స్వగ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్‌ వలస కార్మికులు భాగస్వాములు అయ్యారని.. అలాంటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని చెప్పారు.

నితీశ్, తేజస్వీలతో భేటీ అయి..
బీహార్‌ పర్యటనలో భాగంగా పాట్నా చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లతో భేటీ అయ్యారు. తర్వాత వారు ముగ్గురూ ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమర సైనికుల కుటుంబాలతోపాటు.. కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్‌ వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

తెలంగాణ ఆర్థిక సాయం అభినందనీయం: నితీశ్ కుమార్
గల్వాన్‌ అమర జవాన్లకు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు.

More Telugu News