Bandi Sanjay: ఆ నలుగురు మహిళల మృతికి కేసీఆర్​ సర్కారే కారణం.. ఆరోగ్య మంత్రిని బర్తరఫ్​ చేయాలి: బండి సంజయ్​ డిమాండ్​

  • ప్రభుత్వం రికార్డుల కోసమే గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని మండిపాటు
  • ఇబ్రహీంపట్నంలో మహిళలకు కనీస పరీక్షలు చేయకుండానే ఆపరేషన్లు చేశారని ఆరోపణ
  • బాధితులకు కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
  • సీఎం కేసీఆర్‌ కు రాజకీయాలు తప్ప పేదల బాధలు పట్టవని విమర్శ
Bandi Sanjay fires on CM Kcr about Ibrahimpatnam victims

నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించి నలుగురు మహిళల మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కావాలని రికార్డుల కోసమే గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని.. ఆపరేషన్లు చేసే ముందు మహిళలకు కనీస పరీక్షలు కూడా చేయలేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు.

బాధితులను పరామర్శించకుండా బిహార్ కు వెళ్తారా?
సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నం మృతుల కుటుంబాలను పరామర్శించకుండా బిహార్‌ పర్యటనకు వెళ్లడం ఏమిటని బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కు రాజకీయాలే తప్ప పేదల బాధలు పట్టవని విమర్శించారు. అంతేకాదు.. కనీసం మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి మరణించిన మహిళల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి..
ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరికొందరు మహిళలు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారంతా పేద కుటుంబాలకు చెందినవారేనని.. గొప్పల కోసమే సీఎం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని.. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News