Ashok Babu: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ను సకల సలహాదారులు, పోలీసులు కూడా అడ్డుకోలేరు: అశోక్ బాబు

  • సీపీఎస్ రద్దు కోరుతున్న ఉద్యోగులు
  • జగన్ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్
  • ఛలో విజయవాడ వాయిదా
  • స్పందించిన అశోక్ బాబు
  • ఉద్యోగుల సంకల్పాన్ని మార్చలేరని వెల్లడి
MLC Ashok Babu opines on employees and CPS issue

సీపీఎస్ రద్దు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, సెప్టెంబరు 1న ఛలో విజయవాడ మిలియన్ మార్చ్ కు, ఛలో తాడేపల్లికి పిలుపునిచ్చారు. అయితే, వీటికి అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో, ఉద్యమ కార్యాచరణను సెప్టెంబరు 11కి వాయిదా వేస్తూ ఉద్యోగులు గతరాత్రి తమ నిర్ణయాన్ని వెలిబుచ్చారు.  

ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. ఉద్యోగులతో తాత్కాలికంగా సమ్మె విరమింపజేయగలరేమో కానీ... ఉద్యోగుల సంకల్పాన్ని మాత్రం మార్చలేరని స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాటం జరుగుతోందని అభివర్ణించారు. సీపీఎస్ రద్దు చేస్తామని మాటిచ్చిన జగన్ మడమ తిప్పారని, పోలీసుల సాయంతో ఉద్యోగులను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ను అందుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, 13.35 లక్షల మంది ఉద్యోగులు వైసీపీ సర్కారుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అశోక్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు ఇచ్చే ఈ గిఫ్ట్ ను సకల సలహాదారులు, పోలీసులు ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లకు టీడీపీ మద్దతు ఉంటుందని వెల్లడించారు.

More Telugu News