Mega Million Lottery: రూ. 10,716 కోట్ల లాటరీ.. బహుమతి తగిలినవాళ్లు ఇంకా చూసుకోలేదు.. రావాలంటూ కంపెనీ ప్రకటన

  • లాటరీ తీసి నెల రోజులైనా ముందుకురాని విజేతలు
  • 180 రోజుల వరకు గడువు ఉండటంతో కావాలనే ఆగి ఉండవచ్చనే అభిప్రాయాలు
  • త్వరగా రావాలంటూ లాటరీ నిర్వాహకుల ప్రకటన
Mega millions jackpot not claimed chicago

సాధారణంగా లాటరీ టికెట్ కొన్న వాళ్లు ఏం చేస్తుంటారు. లాటరీ తీసే తేదీ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ఫలితాలను ప్రకటించగానే.. తమకు అదృష్టం తగిలిందా, బహుమతి ఏదైనా వచ్చిందా అని నంబర్లను వెతుక్కుంటారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఆదుర్దాతో తిండీ, నిద్రా మానేసి కూడా వేచి ఉండే వారూ ఉంటారు. 

కానీ అమెరికాలో ఏకంగా రూ. 10,716.18 కోట్లు (134 కోట్ల డాలర్లు) గెలుచుకున్న వారు మాత్రం తాము లాటరీ నంబర్ ను చెక్ చేసుకోలేదు. ఒకటీ రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు అవుతున్నా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో లాటరీ గెలుచుకున్నవారు త్వరగా ముందుకు రావాలంటూ ఆ కంపెనీ ప్రకటన కూడా జారీ చేయాల్సి వచ్చింది.

ఇల్లినాయస్ రాష్ట్రంలో..

  • అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో మెగా మిలియన్స్ లాటరీ నిర్వహిస్తుంటారు. జులై 29న ఏకంగా 134 కోట్ల డాలర్ల విలువైన లాటరీ తీశారు. బహుమతి గెలుచుకున్న లాటరీ టికెట్ల నంబర్లను ప్రకటించారు.
  • అయితే ఇప్పటివరకు ఆ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసినవారు లాటరీ నిర్వాహకులను సంప్రదించలేదు. దీనితో విజేతలు తమను సంప్రదించాలంటూ ఇల్లినాయిస్ లాటరీ డైరెక్టర్ హరోల్డ్ మేస్ ప్రకటించారు.
  • ఈ లాటరీ గెలుచుకున్న నంబర్ల సిరీస్ 13, 36, 45, 57, 67, 14 అని.. చికాగో నగర శివార్లలోని ఓ పెట్రోల్ బంక్ లో ఈ లాటరీ టికెట్ అమ్ముడైందని తెలిపారు. 
  • సాధారణంగా అమెరికాలో ఏ లాటరీకైనా విజేతలు బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి రెండు నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది. అయితే మెగా మిలియన్ లాటరీకి మాత్రం 180 రోజులు గడువు ఉంటుంది.
  • అందువల్ల విజేతలు భారీ మొత్తం గెలుచుకున్న విషయం తెలిసినా.. కావాలనే ఆలస్యం చేస్తూ ఉండవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ మొత్తం గెలుచుకున్న విషయం తెలిస్తే.. తమ ప్రైవసీకి ఇబ్బంది అని భావిస్తుండవచ్చని పేర్కొన్నారు. 
  • మరో విశేషం ఏమిటంటే.. అమెరికా చరిత్రలోనే అత్యంత విలువైన లాటరీల్లో ఇది మూడోది కావడం గమనార్హం. 

More Telugu News