Anand Mahindra: రోడ్లను ఇలా టన్నెల్స్ గా మారిస్తే బాగుంటుంది గడ్కరీ గారు..: ఆనంద్ మహీంద్రా

  • కేంద్ర మంత్రి గడ్కరీకి ఆనంద్ మహీంద్రా కీలక సూచన
  • రహదారుల వెంట కెనోపీ చెట్లను నాటించాలంటూ ట్వీట్
  • ఇందుకు సంబంధించి ఓ అందమైన వీడియో పోస్ట్ చేసిన పారిశ్రామికవేత్త
Anand Mahindra has a request for union minister Nitin Gadkari

కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక సూచన చేశారు. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆనంద్ మహీంద్రా అందరికీ సుపరిచితులు. ఎన్నోకొత్త విషయాలను ట్విట్టర్ ద్వారా పరిచయం చేస్తూ, తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అందుకే ఆయనకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఎక్కువ.


ఓ రహదారి, దానికి ఇరువైపులా పొడవాటి కెనోపీ చెట్లతో చూడ్డానికి ప్రకృతి నిండుదనం సంతరించుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం సొరంగ మార్గంలో ప్రయాణించినప్పుడు ఎలా అనిపిస్తుందో.. ఈ చెట్ల కింద నుంచి రోడ్డుపై వెళుతున్నా అదే అనూభూతి కలుగుతుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఎవరో ఒకరు పోస్ట్ చేసిన దాన్ని ఆయన రీట్వీట్ చేశారు.

దేశంలో కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట ఇదే మాదిరి మొక్కలు నాటించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. రెండు వైపులా చెట్లు ఆకాశం కనిపించకుండా పైకప్పు మాదిరిగా మూసివేయడంతో చూడ్డానికి సొరంగం మాదిరే కనిపిస్తోంది. అందుకే ఆనంద్ మహీంద్రా సైతం దీన్ని టన్నెల్ గా సంబోధించారు.

‘‘నాకు టన్నెల్స్ (సొరంగాలు) అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా నేను ఈ విధమైన టన్నెల్ (వృక్షాలతో కూడిన) ద్వారా వెళ్లాలని అనుకుంటున్నాను. నితిన్ గడ్కరీజీ మీరు కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల పక్కన ఈ టన్నెల్స్ ను నాటించొచ్చు కదా’’అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

More Telugu News