Bandi Sanjay: మేం సామ జగన్మోహనరెడ్డి వారసులుగా వస్తాం... నువ్వు నిజాం వారసుడిగా రా... చూసుకుందాం: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

  • బండి సంజయ్ పాదయాత్ర మూడో విడత ముగింపు
  • హన్మకొండలో భారీ బహిరంగ సభ
  • కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు
  • పీడీ యాక్ట్ లకు భయపడబోమని స్పష్టీకరణ
Bandi Sanjay challenges CM KCR in Hanmakonda

ధర్మం కోసం టీఆర్ఎస్ పై యుద్ధం మొదలైందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ధర్మపరిరక్షకులు పీడీ యాక్ట్ లకు భయపడరని, బీజేపీ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా నిప్పులు చెరిగారు. మేం సామ జగన్మోహనరెడ్డి (త్రివర్ణ పతాకం కోసం బలిదానం చేసిన ఏబీవీపీ కార్యకర్త) వారసులుగా వస్తున్నాం... నువ్వు నిజాం వారసుడిగా రా... తేల్చుకుందాం అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చకు కూర్చుందాం... మోదీ సర్కారు ఎన్ని నిధులు ఇచ్చిందో మేం చెబుతాం అని వివరించారు. 

ధర్మం కోసం పరితపించేవారు దేనికీ భయపడరు అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నామని, కార్యకర్తలు దేనికీ భయపడొద్దు అని పిలుపునిచ్చారు. కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను విడిచిపెట్టే ప్రసక్తేలేదని బండి సంజయ్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలిదానం చేస్తే, చీమలు పెట్టిన పుట్టిలో పాములు దూరినట్టు... కేసీఆర్, ఆయన కుటుంబం అధికారంలోకి వచ్చి ఏ విధంగా ద్రోహం చేస్తుందో అందరూ గమనించాలని అన్నారు.

"కేసీఆర్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు... బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతోందట. ఎక్కడ రెచ్చగొట్టాం మతతత్వం? ఎప్పుడు రెచ్చగొట్టాం మతతత్వం? సీఎం కేసీఆర్ చెప్పాలి. ఇప్పటిదాకా తొలి విడత, రెండో విడత పాదయాత్రలను విజయవంతం చేశాం. చెప్పినట్టుగానే మూడో విడత కూడా విజయవంతంగా ముగించా. మా కార్యకర్తల కాళ్లు, చేతులు విరగ్గొట్టి నువ్వు ఎక్కడైతే పాదయాత్రను అడ్డుకున్నావో, అక్కడ్నించే మళ్లీ మొదలుపెట్టి భద్రకాళి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తానని చెప్పాను... వచ్చాను" అంటూ ప్రసంగించారు. 

కేసీఆర్ తనను జైలుకు పంపాడని, తాను కరీంనగర్ జైలుకు వెళ్లి కేసీఆర్ కు అక్కడో రూము రెడీ చేసి వచ్చానని అన్నారు. సిద్ధిపేటలో బీజేపీ కార్యకర్తలను జైలుకు పంపితే, వారు జైల్లో కేసీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు రూము రెడీ చేశారని వివరించారు. భైంసాలోనూ తమ వాళ్లపై పీడీ యాక్ట్ మోపి జైలుకు పంపారని, అక్కడ కూడా కేసీఆర్ కోసం ఓ రూము రెడీ అవుతోందని, చర్లపల్లిలోనూ కేసీఆర్ కు రూము రెడీ అవుతోందని పళ్లు పటపట కొరుకుతూ ఎంతో కసిగా చెప్పారు.

More Telugu News