KCR: ప్రజల కోసం పనిచేసేవారిని ఇబ్బందిపెడుతున్నారు: సీఎం కేసీఆర్​

  • రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమైన ముఖ్యమంత్రి
  • తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై వివరణ
  • దేశ ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు
CM KCR held meeting with farmers union leaders

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇంకా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడలేదని.. రైతు సమస్యల పరిష్కారం కోసం దేశ పాలకులు ఆలోచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాల్సి ఉందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసేవారిని దేశ పాలకులే ఇబ్బందిపెడుతున్న పరిస్థితి ఉందని.. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శనివారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ను సమావేశమయ్యారు. వ్యవసాయం, సాగునీటి రంగం తదితర అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీని వారికి చూపించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

వ్యవసాయ రంగ సంక్షేమం అవసరం
  దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పర్చేందుకు వ్యవసాయ రంగ సంక్షేమం దిశగా పాలన కొనసాగాల్సి ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని వివరించారు. అయితే దేశవ్యాప్తంగా పరిస్థితి భిన్నంగా ఉందని.. రైతుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పేర్కొన్నారు.

‘‘రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ విషయంలో దేశపాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి. దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధపడుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది.చట్ట సభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ దేశంలో కొనసాగుతుండడం దురదృష్ణకరం. ఇటువంటి పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు ఏకం కావాల్సి ఉంది.” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

More Telugu News