NV Ramana: నాలో ఊపిరి ఉన్నంత వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతాను: వీడ్కోలు ప్రసంగంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

  • సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ
  • సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం
  • గురజాడ సూక్తులతో ప్రసంగించిన ఎన్వీ రమణ
  • ప్రతి పేదకు న్యాయం అందించడమే జడ్జి లక్ష్యమని వెల్లడి
  • ఆ దిశగా తన వంతు కృషి చేశానని వివరణ
CJI NV Ramana farewell speech in Supreme Court

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగించారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని అన్నారు. 

విశ్వ పౌరులుగా సమష్టిగా ప్రగతిశీల ప్రపంచం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'నాలో ఊపిరి ఉన్నంతవరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతాను. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సూక్తిని నిత్యం గుర్తుంచుకుంటాను' అన్నారు. 

అంతకుముందు ఆయన ప్రసంగిస్తూ.... కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడించారు. "12 ఏళ్ల వయసులో నేను తొలిసారి కరెంటును చూశాను. ఓ సాధారణ కుటుంబంలో ఉండే అన్ని కష్టాలు అనుభవించాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. 17 ఏళ్ల వయసులో విద్యార్థి సంఘం ప్రతినిధిగా వ్యవహరించాను. అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చాను. 

సత్యమేవ జయతే అనేది నేను నమ్మే సిద్ధాంతం. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అనేక అవాంతరాలు ఎదురైనా మౌనంగా భరిస్తూ నిలబడ్డాను. నాతో పాటు నా కుటుంబం కూడా ఆవేదనకు గురైంది. కర్తవ్య నిర్వహణలో నా వంతు పాత్ర పోషించానని భావిస్తున్నా. నేను సాధించిన ప్రతి గెలుపులోనూ నా సహచర జడ్జిల భాగస్వామ్యం ఎనలేనిది. నా పదవీకాలంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం మర్చిపోలేను. సుప్రీంకోర్టులో సహకారం అందించిన సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

కేసుల పరిష్కారంలో కొత్త పంథా తీసుకువచ్చాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ మా వంతు కృషి చేశాం. సుప్రీం కొలీజియంతో కలిసి 255 మంది జడ్జిల నియామకానికి సిఫారసు చేశాం. ఇప్పటిదాకా 224 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. 

ఈ వృత్తిలో అనేక ఒడిదుడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలి. న్యాయవాద వృత్తి కత్తి మీద సాము లాంటిది. ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యం. నవతరం జడ్జిలపై గురుతర బాధ్యత ఉంది. తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్ ఇప్పటికే తన గొప్పతనం నిరూపించుకున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు" అంటూ తన వీడ్కోలు ప్రసంగం సాగించారు.

More Telugu News