Congress: ప్రియాంకా గాంధీతో టీపీసీసీ నేత‌ల భేటీ... మునుగోడు ఉప ఎన్నిక‌పై చ‌ర్చ‌

  • నేడు ఢిల్లీలో జ‌రిగిన సమావేశం 
  • ఇటీవ‌లే ద‌క్షిణాది రాష్ట్రాల ఇంచార్జీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్రియాంక‌
  • మునుగోడు రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప్రియాంక ఆరా
priyanka gandhi meeting with tpcc leaders on munugodu bypoll

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా... 2018 ఎన్నిక‌ల్లో ఆ సీటును ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో త‌న సీటును కాపాడుకునే దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బీజేపీలో చేరిన కోమ‌టిరెడ్డి ఆ పార్టీ త‌ర‌ఫున ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు.

ఇక ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మ‌రోవైపు పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తాను మునుగోడు ప్ర‌చారానికి హాజర‌య్యేది లేద‌ని తేల్చి చెప్పేశారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ద‌క్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ శాఖల ఇంచార్జీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా మంగ‌ళ‌వారం ఢిల్లీలో టీపీసీసీ కీల‌క నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ భేటీలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ గౌడ్‌, పార్టీ సీనియ‌ర్లు జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మునుగోడులో రాజ‌కీయ ప‌రిస్థితులు, పార్టీ బ‌లం త‌దిత‌రాల‌పై నేత‌లు ప్రియాంక‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం.

More Telugu News