Sovereign Gold Bond: బంగారం బాండ్లపై రుణం లభిస్తుందా..?

  • భౌతిక బంగారం మాదిరే సావరీన్ గోల్డ్ బాండ్లపైనా రుణం
  • తనఖా కింద ఉపయోగించుకోవచ్చన్న ఆర్బీఐ
  • ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.25 లక్షల వరకు రుణం
Can you take a loan against your  investments

సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్ జీబీ) ఇన్వెస్ట్ చేసే వారు పెరుగుతున్నారు. భౌతిక బంగారంపై పెట్టుబడులు తగ్గించి, డిజిటల్ వైపు మళ్లించేందుకు తీసుకొచ్చినదే ఎస్ జీబీ. ఏటా ఆర్బీఐ పలు పర్యాయాలు ఎస్ జీబీలను విడుదల చేస్తుంటుంది. ఎనిమిదేళ్ల పాటు ఈ బాండ్ కాల వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత బంగారం మార్కెట్ ధర ఆధారంగా చెల్లిస్తారు. అలాగే, 8 ఏళ్లపాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.


ఎనిమిదేళ్ల పాటు బాండ్ కాలవ్యవధి ఉంటుంది కనుక.. ఈ లోపు డబ్బులు అవసరం పడితే బాండ్ సాయంతో రుణం పొందేందుకు అవకాశం ఉంది. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీల నుంచి తీసుకునే రుణాలకు హామీగా ఎస్ జీబీ లు చెల్లుబాటు అవుతాయి. తరచుగా అడిగే ప్రశ్నల జాబితాలో ఆర్బీఐ ఈ విషయమై స్పష్టత కూడా ఇచ్చింది. రుణాలకు తనఖా కింద ఈ బాండ్లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 

భౌతిక బంగారంపై రుణానికి మాదిరే బంగారం బాండ్ల విషయంలోనూ లోన్ టు వ్యాల్యూ సూత్రాన్ని బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు అనుసరిస్తాయి. డీమ్యాట్, భౌతిక రూపంలో బాండ్ కలిగి ఉన్నా రుణం పొందొచ్చు. ఒక వ్యక్తికి రూ.20వేల నుంచి రూ.20 లక్షల వరకు బంగారం బాండ్లపై ఎస్ బీఐ రుణం కింద ఇస్తుంది. పీఎన్ బీ అయితే రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాన్ని ఆఫర్ చేస్తోంది. యూనియన్ బ్యాంకు అయితే రూ.50వేల నుంచి రూ.25 లక్షల వరకు రుణాన్ని ఆఫర్ చేస్తోంది.

రుణాన్ని ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో, డిమాండ్ లోన్ రూపంలో బ్యాంకులు అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి వేర్వేరుగా ఉంది. బ్యాంకులు ప్రాసెసింగ్ చార్జీలను సైతం వసూలు చేస్తున్నాయి.

More Telugu News