Antarctica: అంటార్కిటికాలో ముగిసిన శీతాకాలం.. నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత ఉదయించిన సూర్యుడు

  • సూర్యోదయం ఫొటోలను విడుదల చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
  • శీతాకాలంలో మైనస్ 70 నుంచి 80 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
  • పరిశోధనలకు అనువుగా ఈ నాలుగు నెలల కాలం 
Sun rises in Antarctica after four months of darkness

అంటార్కిటికాలో నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత సూర్యుడు ఉదయించాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. తాము సూర్యోదయాన్ని చూసినట్టు అక్కడి కాంకోర్డియా పరిశోధనా కేంద్రంలోని 12 మంది సభ్యుల బృందం తెలిపింది. శీతాకాలం తర్వాత అంటార్కిటికాలో తొలి సూర్యోదయం ఫొటోలను వైద్యుడు హన్నెస్ హాగ్సన్ తీయగా, ఈఎస్ఏ వాటిని విడుదల చేసింది. 

అంటార్కిటికాలో రెండు కాలాలు మాత్రమే ఉంటాయి. ఒకటి వేసవి, రెండోది శీతాకాలం. ఎప్పుడూ మైనస్ డిగ్రీలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం ప్రారంభం కాగానే మైనస్ 70 నుంచి 80 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాగా, అంటార్కిటికాలో చివరిసారి మే 3న సూర్యాస్తమయం అయింది. ఆ తర్వాత సూర్యుడు కనిపించడం ఇదే తొలిసారి.

ఈ కాలంలో సూర్యుడన్న మాటే ఉండదు. ఆగస్టు వరకు నాలుగు నెలలపాటు చిమ్మచీకటి అలముకుని ఉంటుంది. ఈ చిమ్మచీకటి కాలాన్ని పరిశోధకులు ‘బంగారు గని’గా అభివర్ణిస్తారు. ఈ కాలంలో వివిధ పరిశోధనలు నిర్వహిస్తారు. మలమూత్రాలు, రక్త నమూనాల నుంచి డేటా సేకరిస్తారు. మానవ శరీరంపై సాధారణ, పరిమిత, విపరీత వాతావరణాల ప్రభావాలను అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యోమగాములకు కూడా ఉపయోగపడుతుంటాయి.

More Telugu News