Congress: మునుగోడు అభ్య‌ర్థిపై కాంగ్రెస్ కీల‌క భేటీ... డుమ్మా కొట్టిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

  • ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగిన భేటీ
  • టీపీసీసీ కీల‌క నేత‌లంతా రావాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు
  • ఉద‌యం ఢిల్లీలో పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశానికి హాజ‌రైన వెంక‌ట్ రెడ్డి
  • ఆ స‌మావేశం ముగిసిన వెంట‌నే హైద‌రాబాద్ వ‌చ్చేసిన వైనం
komatireddy venkat reddy skips aicc meeting in delhi

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయ‌కత్వం సోమ‌వారం ఢిల్లీలో ఓ కీల‌క భేటీ నిర్వ‌హించింది. ఈ భేటీకి రావాలంటూ పార్టీ తెలంగాణ నేత‌ల‌కు ఏఐసీసీ నుంచి ఆహ్వానం కూడా అందింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా జ‌రిగిన ఈ భేటీకి భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి డుమ్మా కొట్టారు. 

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో ఆయ‌న‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌హా ప‌లువురు నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో త‌న సోద‌రుడితో పాటు త‌న‌నూ క‌లిసి దూషించారంటూ వెంక‌ట్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని, ఈ కార‌ణంగా తాను మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాలేన‌ని కూడా వెంక‌ట్ రెడ్డి తేల్చి చెప్పారు.

అయితే టీపీసీసీలో స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న వెంక‌ట్ రెడ్డి ప్ర‌చారానికి దూర‌మైతే ఉప ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫ‌లితాలు ఎదుర‌వుతాయ‌న్న భావ‌న‌తో రేవంత్ రెడ్డి... వెంక‌ట్ రెడ్డికి బ‌హిరంగంగానే క్ష‌మాప‌ణ చెప్పారు. అయినా కూడా వెంక‌ట్ రెడ్డి మెత్త‌బ‌డ‌లేదన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ వాద‌న‌లు నిజ‌మేన‌న్న‌ట్లు పార్టీ హైక‌మాండ్ నుంచి ఆదేశాలు వ‌చ్చినా... సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలోనే ఉన్న వెంక‌ట్ రెడ్డి... పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశానికి హాజ‌రై... ఆ స‌మావేశం ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే హైద‌రాబాద్ వ‌చ్చేశార‌ని సమాచారం.

More Telugu News