Gujarat: గుజరాత్​ ఎన్నికల కోసం నన్నూ అరెస్టు చేస్తారేమో..: కేజ్రీవాల్​

  • ఢిల్లీలో ఆప్ సర్కారును కూల్చేందుకే సీబీఐ, ఈడీ దాడులని ఆరోపణ
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కావాలని కేసుల్లో ఇరికించారని మండిపాటు
  • కేంద్ర ప్రభుత్వ తీరుతో ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్య
Will I be arrested for Gujarat elections says Kejriwal

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు సిగ్గు చేటు అని.. ఢిల్లీలో మెరుగైన విద్య కోసం కృషి చేసిన వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం గుజరాత్ లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. తాము గుజరాత్ లో తప్పులను ఎత్తి చూపించినందుకు, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే తమను ఇబ్బందిపెడుతోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల కోసం తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్రం తీరు సిగ్గుచేటు
‘‘మనీష్ సిసోడియా గొప్ప విద్యాశాఖ మంత్రి. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ లోనూ ఆయన ఘనతతో ఫొటో ప్రచురితమైంది. అలాంటి వ్యక్తిని వీలైతే భారతరత్నతో సత్కరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. నాణ్యమైన విద్యను అందించే కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చిన వ్యక్తిపై సీబీఐ దాడులు సిగ్గుచేటు..” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కొన్ని రోజుల్లో మనీష్ సిసోడియా అరెస్టు కావొచ్చని వినబడుతోందని.. తనను కూడా అరెస్టు చేస్తారేమో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల కోసమే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

మద్యం పాలసీ వివాదంతో..
గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కారు తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ విషయంలో మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చాయి. దీనితో సిసోడియా నివాసంతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ దాడులు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆప్‌ ను వీడి బీజేపీలో చేరితే కేసులు ఎత్తివేస్తామని బీజేపీ పిలిచిందని సిసోడియా ప్రకటించడం.. ఆప్‌ ను చీల్చితే తనకు సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేసిందని పేర్కొనడం కూడా సంచలనం రేపుతోంది. దీనిపైనా కేజ్రీవాల్ స్పందించారు. అంటే ఇతర రాష్ట్రాల్లోలా ఢిల్లీలో ఆప్ సర్కారును పడగొట్టేందుకే సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News