Sovereign Gold Bonds: బంగారం బాండ్ల ఇష్యూ ఆరంభం.. గ్రాము రూ.5,197

  • ఈ నెల 26న ముగియనున్న ఇష్యూ
  • ఎనిమిదేళ్ల కాల వ్యవధి
  • అప్పటి వరకు కొనసాగిస్తే లాభంపై పన్ను ఉండదు
  • ముందుగా విక్రయించేందుకు పలు మార్గాలు
Sovereign Gold Bonds opens for subscription on August 22

సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్ జీబీ) ఇష్యూ నేడు (22న) మొదలైంది. ఆగస్టు 26న క్లోజ్ కానుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను విడుదల చేస్తుంది. ఒక గ్రాము ధర రూ.5,197గా నిర్ణయించింది. పౌరులు అందరూ ఇందులో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, చెల్లింపులు చేసే వారికి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. 

ఒక గ్రాము ధర రూ.5,197గా ఆర్బీఐ ప్రకటించింది. వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. వ్యక్తిగత పెట్టుబడికైతే ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. అదే ట్రస్ట్ లు అయితే 20 కేజీల వరకు కొనచ్చు. ఇది ఎనిమిదేళ్ల కాలవ్యవధితో వస్తుంది. అంటే ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా చెల్లింపులు చేస్తారు. గడువు తీరే వరకు పెట్టుబడి కొనసాగిస్తే లాభాలపై పన్ను ఉండదు.

ఒకవేళ ఎనిమిదేళ్ల లోపు పెట్టుబడి వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, ఐదో ఏట తర్వాత ఆర్బీఐ ఏడాదికోసారి అవకాశం కల్పిస్తుంది. ఎనిమిదేళ్లలోపు తీసుకుంటే లాభంపై పన్ను పడుతుంది. ఐదేళ్లలోపు విక్రయించాలంటే స్టాక్ ఎక్సేంజ్ లలో అందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీని ఆర్బీఐ చెల్లిస్తుంది.

More Telugu News