Kim Jong Un: కిమ్ ప్రసంగంతో వెక్కివెక్కి ఏడ్చిన ఆర్మీ వైద్యులు.. ఇంతకీ కిమ్ ఏం చెప్పారు?

  • కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఆర్మీ వైద్యులను రంగంలోకి దింపిన కిమ్
  • వారి సేవలను గుర్తిస్తూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కిమ్
  • ఆర్మీ వైద్యుల మనసులు తాకేలా ప్రసంగించిన కిమ్
  • చిన్నపిల్లల్లా ఏడ్చేసిన ఆర్మీ వైద్యులు
North Korean military medics weep at Kim Jong uns praise

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగిస్తున్నారంటే అది ఏ దేశానికైనా హెచ్చరికో.. ఇంకేదో కీలక ప్రకటనో అయి ఉంటుందని ప్రపంచం భావిస్తుంది. చూడ్డానికి కఠినంగా కనిపించే కిమ్ తాజాగా తమ దేశ ఆర్మీ వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి హృదయాలను తడిమేశాయి. కిమ్ ప్రసంగం వింటూనే వైద్యులు కంటతడి పెట్టుకున్నారు. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల క్రితం ఈ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉత్తర కొరియాను భయపెట్టింది. అయితే, కేసుల సంఖ్యను ఎప్పుడూ ఆ దేశం బయటపెట్టలేదు. అనారోగ్యం బారినపడిన వారి సంఖ్యను మాత్రమే ప్రకటిస్తూ వచ్చింది. ఆ తర్వాత అది కూడా మానుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే కిమ్ జోంగ్ ఉన్ ఓ ప్రకటన చేస్తూ తాము కరోనాను జయించేశామని ప్రకటించారు. ఆ ప్రకటన వినగానే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. 

కరోనా సమయంలో కీలక సేవలు అందించిన ఆర్మీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ ఓ భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కిమ్ ప్రసంగిస్తుండగా ఆర్మీ వైద్యులు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించారు. వారు అలా కన్నీళ్లు పెట్టుకోవడం వెనక కారణం ఉంది. కరోనా సమయంలో మహమ్మారితో పోరాడేందుకు కిమ్ ప్రభుత్వం ఆర్మీ వైద్యులను రంగంలోకి దింపి ‘కరోనా పోరాట ఫ్రంట్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది.

కరోనాను జయించామని కిమ్ ప్రకటించిన తర్వాత ఈ బాధ్యతల నుంచి ఆర్మీ వైద్యులకు విముక్తి కల్పించింది. ఈ క్రమంలో వారు చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపేందుకు గురువారం రాజధానిలో భారీ సభ ఏర్పాటు చేసింది. కిమ్ సహా వందలామంది కీలక అధికారులు, మిలటరీ వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది దీనికి హాజరయ్యారు. కిమ్ ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో ఉత్తర కొరియా సాధించిన విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు. అది విన్న మిలటరీ వైద్యులు, ఇతర అధికారులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

More Telugu News